ఆరుషి హత్యకేసులో నూపుర్ విడుదల
Published on: Wed Sep 26, 2012 2:08PM

ఆరుషి హత్యకేసులో తల్లి నూపుర్ తల్వార్ విడుదలయ్యింది. కన్నకూతురు ఆరుషితోపాటు పనివాడినికూడా చంపేశారన్న అభియోగాలపై విచారణను ఎదుర్కున్న నూపుర్ కి వారంరోజుల క్రితం సుప్రీంకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఐదునెలలుగా ఘజియాబాద్ లోని దస్నా జైల్లో ఉన్న నూపుర్ కి విముక్తి లభించింది. ఈ కేసులో మీడియా చేసిన సాయంవల్లే నూపుర్ విడుదల కాగలిగిందని, న్యాయం కోసం గట్టిగా పోరాడతామని ఆరుషి తండ్రి రాజేష్ చెబుతున్నారు. 2008 మే 16న నోయిడాలోని రాజేష్ ఇంట్లో ఆరుషి, హేమరాజ్ ల జంటహత్యలు కలకలం రేపాయి. కూతురు పనివాడితో తిరుగుతుందన్న కోపంతో తల్లిదండ్రులే ఆ పిల్లని, పనివాణ్ణి చంపేశారని సీబీఐ దంపతులిద్దరిమీదా అభియోగాలు మోపి అరెస్ట్ చేసింది. ఢిల్లీ హైకోర్ట్ ఇద్దరికీ రిమాండ్ విధించింది. సుప్రీంకోర్ట్ బెయిల్ పిటిషన్ ఆమోదించడంతో నూపుర్ కి జైలునుంచి విముక్తి లభించింది.


