బాలకృష్ణ త్వరగా కోలు కోవాలని నుడా చైర్మన్ ప్రత్యేక పూజలు.!
Published on: Fri Jul 24, 2026 3:33PM

సినిమా షూటింగ్ లో గాయపడిన నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని కోరుకుంటూ నెల్లూరులోని మూలాపేట శివాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణ మార్గంలో పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ..
కాకినాడ పోర్టులో జరుగుతున్న ఓ సినిమా ఫైట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ కాలికి గాయమైందనీ, ప్రస్తుతం ఆయన ధైర్యంగా ఉన్నారని, ఆసుపత్రిలో విజయవంతంగా సర్జరీ పూర్తయ్యిందనీ చెప్పారు. ఆయన గాయపడి చికిత్స పొందుతున్న సమయంలో పరామర్శించేందుకు తాను ఫోన్ చేస్తూ.. ఎదురు ఆయనే తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని కోటంరెడ్డి చెప్పారు.
సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ బాలకృష్ణ రియల్ హీరో అన్న ఆయన డూప్ ఉపయోగించవచ్చని నిర్మాతలు చెప్పినా స్వయంగా స్టంట్లు చేయడానికే ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. తాను గుండెకు స్టంట్ వేయించుకున్నప్పటికీ, తన దైవంగా భావించే బాలకృష్ణ ఆరోగ్యం కోసం పొర్లు దండాలు పెట్టానన్నారు.
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వేలాది మంది రోగుల ఆశీస్సులు బాలకృష్ణకు ఉంటాయని, వారి అభిమానంతో ఆయన నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు.
NUDA Chairman, Special Prayers, Balakrishna, Speedy, Recovery, Nellore, Kotamreddy


