ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన వైసీపీ కార్యకర్తలు

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు తొలగించారు. 2 సంవత్సరాల క్రితం సీతానగరం గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి పంచాయతీ తీర్మానంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని, జ్యోతుల నెహ్రూ పౌండేషన్ సౌజన్యంతో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే, తాజాగా సీతానగరం గ్రామ వైయస్సార్ సిపి నాయకులు కొందరు షెల్టర్ తొలగించి ఎన్టీఆర్ విగ్రహాన్ని పక్కనే ఉన్న కళ్యాణ మండపం దగ్గర వదిలివేసారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం తో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని తొలగించడం పై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాగా, విగ్రహాన్ని తొలగించిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఇప్పటికే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎందరో అభిమానించే, ఆరాధించే మహానాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.