ఆంధ్రప్రదేశ్ లో మరో అరాచకం ! తూ.గోలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం
Published on: Fri Feb 5, 2021 11:25AM
ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయాలపై వరుసగా జరిగిన దాడులు తీవ్ర కలకలం రేపగా.. తాజాగా రాజకీయ నేతలపై పడ్డారు దుండగులు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పంచాయతీ ఎన్నికల వేళ ఎన్టీఆర్ విగ్రహం కావడం మంటలు రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది.
తూర్పు గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ట్వీట్టర్ లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మూర్ఖత్వానికి మానవ రూపం వైఎస్ జగన్. మహనీయుల విగ్రహాలు కూలుస్తూ జగన్ రెడ్డి మరింత దిగజారిపోయాడు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాల పై పడింది. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిది విగ్రహం పడగొడితే చేరిగిపోయే చరిత్ర కాదు' అన్నారు లోకేష్. 'తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ని కఠినంగా శిక్షించాలి' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా విమర్శలు గుప్పించారు. 'తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో జరిగిన ఘటన ఇది. స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని రాజకీయ కక్షతో దుష్టశక్తులు నాశనం చేయడం దుర్మార్గపు చర్య. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన నాటి నుండి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి' గోరంట్ల బుచ్చయ్య విమర్శించారు. 'మూర్ఖత్వం పరాకాష్ఠకు చేరుకుంటే ఇటువంటి చర్యలు కి దారి తీస్తాయి. మీరు విగ్రహాన్ని ధ్వంసం చేస్తేనో.. లేక దాడులు చేస్తేనో తెలుగుదేశం పార్టీని బలహీన పరచలేరు. పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అధికార ఒత్తిళ్లు కి తలోగ్గకుండా వ్యవహరించాలి' అని గోరంట్ల బుచ్చయ్య డిమాండ్ చేశారు.


