అన్నగారి బయోపిక్... అంగట్లో బఠాణీనా..!

 

ఆరడుగుల ఆజానుబాహువుడు.. ఏ పాత్ర వేసినా సరే ఆ పాత్రకే అసూయపుట్టేలా నటించగలిగిన నటుడు.. తెలుగుప్రజలు అన్నగారు అని పిలుచుకునే ఒకే ఒక వ్యక్తి నందమూరి తారకరామారావు.  అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. నిజం చెప్పాలంటే రాముడు పాత్ర కానీ, కృష్ణుడు పాత్ర కానీ వేస్తే నిజంగా వాళ్లు ఇలానే ఉంటారేమో అన్నట్టు ఉండేవాడు. పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసినవాడు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. అందుకే విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదను సొంత చేసుకున్నాడు. ఇక సినిమాలకు దూరమైన తరువాత రాజకీయాల్లో కూడా తన చక్రం తిప్పాడు. మరి అలాంటి వ్యక్తి బయోపిక్ తీయాలంటే మామూలు విషయమా. చాలా కష్టమైన పనే. కానీ మన దర్శక, నిర్మాతలు మాత్రం అదేదో రెగ్యులర్ మూవీ అన్నట్టు ఎన్టీఆర్ బయోపిక్ మేం తీస్తున్నాం అంటే మే తీస్తున్నామని పోటీ పడుతున్నారు.

 

ఈ వరుసలో ముందున్న పేరు ఎవరిదంటే వివాదాల వర్మ రామ్ గోపాల్ వర్మే. తాను ఎన్టీఆర్ బయోపిక్ ను తీస్తున్నానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలసిందే. దానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని కూడా పేరు ఫిక్స్ చేసేశాడు. అయితే సినిమా షూటింగ్ సంగతి ఏమో తెలియదు కానీ.. సినిమా ప్రారంభించకముందే జరగాల్సిన రచ్చ మొత్తం జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ వర్సెస్ వర్మ అన్నట్టు తయారైంది పరిస్థితి. వర్మ కంటే ముందే.. నందమూరి బాలకృష్ణ నిర్మాతగా , దర్శకుడు తేజ మరో చిత్రానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి తాను కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నానని ప్రకటించేశాడు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తాను కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు... తన చిత్రంలో సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో వాణి విశ్వనాథ్ కూడా భాగస్వామ్యమైనట్టు తెలిపారు.

 

మరి ఓ గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎవరిని నొప్పించకూడదు.. పర్ ఫెక్ట్ స్ర్కిప్ట్.. ఇన్ఫర్మేషన్ ఉండాలి.. కాస్త అటూ ఇటూ తేడా ఏమన్న జరిగిందంటే పరిస్థితి మామూలుగా ఉండదు.. అలాంటిది.. ఒకరి తరువాత ఒకరు చాలా సింపుల్ గా ఎన్టీఆర్ బయోపిక్ కు తీస్తున్నామని ప్రకటించేసుకుంటున్నారు. చూద్దాం ఇంకెంతమంది అన్నగారి జీవిత చరిత్రను తీస్తామని ముందుకొస్తారో..!