ఎన్టీఆర్ కు ఘన నివాళులు...

 

మే 28 గురించి ఎన్టీఆర్ అభిమానులకు పత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు ఎన్టీఆర్‌ అభిమానులకు పెద్ద పండుగే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ జన్మదినం కావడంతో తెదేపా నేతలు ఘనంగా జరుపుకొంటున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. నందమూరి హీరోలు పలువురు ఎన్టీఆర్ స్మృతి చిహ్నాన్ని సందర్శించి, పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణతో పాటు ఆయన కుమారులు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

 

 

ఇక విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్‌ కి గుర్తు చేసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాలని ఒక సేవాభావంతో ఆ రోజుల్లోనే ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ తరువాత పార్టీ పెట్టారు" అని అన్నారు. ఆపై జాతీయ స్థాయిలో ప్రభావం చూపారని, పలు ప్రజోపయోగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. సంక్షేమాన్ని మరో మెట్టు ఎక్కించిన ఘనత ఆయనదేనని అన్నారు. ఎన్టీ రామారావుపై ప్రశంసలు కురిపించారు.

 

 

అంతేకాదు.. తాను ఎన్టీఆర్ ను తొలిసారి కలిసినప్పటి సంగతిని గుర్తు చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. 1982వ సంవత్సరంలో "మొట్టమొదటిసారి... నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నప్పుడు... ఎన్టీ రామారావుగారిని కలవాలని రామకృష్ణా స్టూడియోస్ కు వెళ్లాను. అపాయింట్ మెంట్ తీసుకుని.. ఇప్పటికి కూడా జ్ఞాపకం.. అది 'అనురాగ దేవత' షూటింగ్... అందులో శ్రీదేవి వెడ్డింగ్ సీన్. అదెప్పటికీ నేను మరచిపోలేను. మొదటిసారి ఆయనతో మాట్లాడినప్పుడు... ఆయన చెప్పింది... 'నేను కూడా ఆలోచిస్తున్నాను. 60 సంవత్సరాల వరకూ కుటుంబ బాధ్యత నాపై ఉంది. ఇంకో సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో నా బాధ్యత పూర్తవుతుంది' అన్నారు..ఆ తరువాత ప్రజలకు సేవ చేయాలని అన్నారని చెప్పుకొచ్చారు.