అన్నగారిని మరచిన వారసులు

Publish Date:May 29, 2013

 

స్వర్గీయ యన్టీఆర్ పై సర్వ హక్కులు తమవేనని వాదించేవారు తెలుగుదేశం పార్టీలో చాల మందే ఉన్నారు. ఇక పార్లమెంటులో ఆయన విగ్రహం పెట్టే హక్కు తమదంటే తమదే అని ఆయన కుమార్తె పురందేశ్వరి, చంద్రబాబు నాయుడు ఏకంగా ఒక దశాబ్ద కాలం పాటు తీవ్ర యుద్దం చేసారు. ఎట్టకేలకు ఎలాగయితేనేమి యన్టీఆర్ విగ్రహం పార్లమెంటులో ప్రతిష్టించడం జరిగింది. అంతటితో ఆ కదా సమాప్తం అయిపోయినట్లు అందరూ చేతులు దులుపుకొని హైదరాబాద్ వచ్చేసారు. నిన్న యన్టీఆర్ 90వ జయంతి సందర్భంగా హైదరాబాదులో యన్టీఆర్ ఘాట్ వద్ద మూకుమ్మడిగా వచ్చిఘనంగా నివాళులు అర్పించిన నందమూరి వారు, తెలుగుదేశం పార్టీ నేతలు తాము పోటీలు పడి మరీ డిల్లీలో నెలకొల్పిన యన్టీఆర్ విగ్రహానికి ఈ సందర్భంగా ఒక దండ వేయించాలనే సంగతి మరిచిపోయారు.

 

ఇక అయినవారికే శ్రద్ధ లేనప్పుడు డిల్లీలో ఉండే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఎందుకు పట్టించుకొంటారు? ఎవరూ పట్టించుకోకపోయినా పార్లమెంటు నియమావళి ప్రకారం లోక్ సభ స్పీకర్ అధికారికంగా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించి అక్కడ నెలకొల్పిన మహానీయుల విగ్రహాలకు తప్పనిసరిగా పూలమాలలు వేసి ఒకసారి వారిని స్మరించుకోవడం ఆనవాయితీ. కానీ, అది కూడా నిర్వహించలేదు. కనీసం యన్టీఆర్ అసలయిన వారసులు తామేనని వాదులాడుకొనే తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబంలో ఏఒక్కరూ కూడా నిన్న ఆయన విగ్రహానికి ఒక దండ వేయించే ఏర్పాటు చేయలేకపోయారు.