రియల్ రంగంపై ఎన్ఆర్ఐ ఎఫెక్ట్
Published on: Thu Jun 9, 2022 1:22PM
రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్ ఏమిటి? ఆర్థిక,వ్యాపార, వాణిజ్య రంగాల్లో, అలాగే సామాన్య మధ్యతరగతి వర్గాల్లో తరచూ వినిపించే ప్రశ్నల్లో.. ఇది తప్పక ఉంటుంది. అలాగే, ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఎప్పటికప్పడు మారిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా బూమ్ వచ్చేస్తుంది. అంతలోనే ఢమాల్ మంటుంది. రియల్ వ్యాపారం కుదేలై పోతుంది.
కొవిడ్’తో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా కోలుకుంటున్న సమయంలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది. సిమెంట్, ఇనుము, ఇసుక ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా వ్యయం పెరిగింది. ఇంకా అనేకం .. మొత్తంగా నిర్మాణ వ్యయం పెరింగింది. పెరిగిన ధరల ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం మరో మారు కుదేలైంది. ఇలాంటి వడిదుడుకులు అన్నిరంగాలలో ఉంటాయి. ముఖ్యంగా, రియల్ ఎస్టేట్ వంటి స్పెక్యులేషన్ రంగంలో వడిదుడుకులు. పడి లేవడాలు , సహజం.
అయితే, ఇప్పడు రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడే ప్రమాదం ఉందని రియల్ రంగం నిపుణులు అంచనా కొస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై ఇప్పటికే కొంత ప్రభావం చూపుతున్న విదేశీ వలసల ప్రభావం’ ముందు ముందు మరింతగా ఉంటుందని అంటున్నారు. ఒకప్పుడు, (ఇప్పటికి కూడా) పల్లెల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి నగరాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు సాగితే, ఇప్పుడు ఏకంగా విదేశాలకు వలసలు పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికీ వెళ్ళినా, భారతీయ సంతతికి చెందిన ప్రవాస భారతీయులు ఎంతో పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.భారత్ నుంచీ విద్యా, ఉద్యోగ, వ్యాపార, జీవన వ్యాపకాల కోసం విదేశాలకు వెళ్ళిన వారిలో, ఎక్కువ మంది అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఆర్ధికంగా స్థిరపడుతున్నారు. భారత విదేశాంగ శాఖ అధికారిక లెక్కల ప్రకారం, 32 మిలియన్ల మంది భారతీయ సంతతికి చెందిన ప్రవాస భారతీయులు విదేశాలలో ఉన్నారు.
ప్రపంచ దేశాలలో జీవిస్తున్న విదేశీ సంతతి పౌరులలో భారత దేశానిదే ప్రథమ స్థానం. ప్రతి సంవత్సరం 25 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. ప్రపచ దేశాలు అన్నిటిలో, ప్రతి సంవత్సరం విదేశాలకు వెళుతున్న వారిలోనూ మన దేశానిదే ప్రథమ స్థానం. మరో వంక, భారత పౌరసత్వాన్ని వదులు కుంటున్న ప్రవాస భారతీయుల సంఖ్య కూడా సంవత్సర సంవత్సరానికి గణనీయంగా పెరిగి పోతోందని గణాంకాలు సూచిస్తున్నాయి. విదేశాంగ శాఖ వెబ్సైటు అందించిన వివరాల ప్రకారం, 2017 నుంచి 2021 మధ్య సుమారు 6.08 శాతం మంది భారతీయులు, భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దేశ జనభాలో ఒక శాతం మంది విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ సంఖ్య ఏడాది ఏడాదికి పెరుగుతోంది.
నిజానికి గతంలో ఉద్యోగ, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన వారు, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చి, ఇళ్ళు వాకిళ్ళు ఏర్పరచుకుని, పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడం ఉండేది. ఈ క్రమంలో, గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రవాస భారతీయులు రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఇప్పటికీ, కొంత వరకు ఆధోరణి కొనసాగుతోంది.
అయితే, ఇప్పుడు తరాలు మారుతున్న నేపధ్యంలో విదేశాలలో స్థిరపడిన వారు, భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. మరోవంక భారతదేశంలో ఇప్పటికే ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. చివరకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను కూడా తెగనమ్ముకుని తామున్న దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి ఇపుడు చాలా వేగంగా పెరిగిపోతోంది. దేశంలో, రియల్ ఎస్టేట్ వ్యాపరం జోరుగా సాగే, హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఈ ఈ ధోరణి కనిపిస్తోందని అంటున్నారు.
ఈ నేపధ్యంలో ఇప్పటికే, అనేక కారణాల చేత వడిదుడుకులు ఎదుర్కుంటున్న రియల్ ఎస్టేట్ రంగం ముందు ముందు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అది ఇప్పటికిప్పుడు జరుగుతుందా అంటే, లేదు ... ఇప్పుడే మొదలైన ఈ ధోరణి ఇలాగే సాగితే మటుకు, రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడుల సంక్షోభంతోపాటుగా మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కునే ప్రమాదం లేక పోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


