దత్తత...ఇన్సూరెన్స్.. ఓ మర్డర్

ఇంట్లో అన్ని ఉన్నా చిన్నారుల బోసినవ్వులు, బుడిబుడి నడకలు లేకుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పిల్లలు పుట్టే అవకాశం లేని పక్షంలో దత్తత ద్వారానైనా ఆ ప్రేమను సొంతం చేసుకుంటారు కొంతమంది దంపతులు. మానవ సంబంధాలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో డబ్బు కోసం తల్లిదండ్రుల ప్రాణాలని తీసే పిల్లలను చూస్తున్నాం..అయితే ఈ ఘటనలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. గుజరాత్ నుంచి లండన్ వెళ్లిన ఆర్తి, కన్వల్‌జిత్ సింగ్ దంపతులు గోపాల్ అనే పిల్లవాడిని నితీష్ అనే మిత్రుడి ద్వారా దత్తత తీసుకున్నారు. అతని పేరిట 1.2 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించారు. దత్తతకు సహకరించిన నితీష్ కూడా లండన్‌లోనే ఉండి వీసా గడువు ముగియడంతో 2015లోనే గోపాల్‌తో సహా గుజరాత్ తిరిగివచ్చాడు.

 

 

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8న గోపాల్‌ను వెంటబెట్టుకుని సొంత ఊరికి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటర్‌ సైకిల్‌పై వచ్చి పిల్లవాడిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గోపాల్‌ను ఆసుపత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి నిన్న తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు నితీష్‌ను తమదైన స్టైల్లో విచారించగా అసలు వాస్తవాలు బయటపడ్డాయి.  

 

 

అసలు ఆ ఎన్నారై దంపతులు గోపాల్‌ను దత్తత తీసుకున్నదే ఇన్సూరెన్స్ సొమ్ము కోసమని చెప్పాడు నితీష్..ఆ బాలుడిని కడతేర్చడానికి 2015 నుంచి ప్రయత్నించినట్లు..చివరికి 5 లక్షల రూపాయలకు కిరాయి హంతకులతో బేరం కుదుర్చుకున్నామని వెల్లడించాడు..ప్లాన్‌లో భాగంగానే గోపాల్‌ను తీసుకుని రాజ్‌కోట్ బయలుదేరినట్లు తెలిపాడు.  తనపై అనుమానం రాకుండా ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లానని అసలు నిజాన్ని బయటపెట్టాడు . నితీష్‌ వాంగ్మూలంతో ఆ ఎన్నారై దంపతుల కిరాతకం వెలుగులోకి వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఎన్నారై దంపతులను ఇండి‌యా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది.