దోచేయ్.. రాష్ట్ర ఉద్యోగులకు కేంద్రం కోతలు.. క్రిప్టో కరెన్సీపైనా పన్ను బాదుడు
Published on: Tue Feb 1, 2022 12:21PM
ప్రభుత్వాలు ఏవైనా దోచేయ్.. దాచేయ్.. విధానాలే అవలంభిస్తాయి. అది కేంద్రమైనా.. రాష్ట్రాలైనా. అందులోనూ ఉద్యోగులంటే వారికి మరీ చులకన భావం. ఇక ఉద్యోగం చేసి సంపాదించే వారంటే మరింత లోకువ. పన్నులపై పన్నులు బాదేయడమే ప్రభుత్వాల టార్గెట్. కోతలతో వాతలు పెట్టడమే వారికి హామీ. లేటెస్ట్ బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం పలు కోతలు, వాతలు వడ్డించింది.
ఇకపై, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) డిడక్షన్ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్పీఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటి వరకూ ఉన్న కటింగ్స్ సరిపోనట్టు.. ఇప్పుడు ఎన్పీఎస్ పేరుతో కేంద్రం సైతం తమ జీతాల్లో కోత పెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పటికే జగనన్న.. పీఆర్సీతో జీతానికి భారీ బొక్క పెట్టగా.. అది చాలదన్నట్టు ఇప్పుడు కేంద్రం సైతం ఎన్పీఎస్ కట్ చేస్తామని ప్రకటించడం.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉందంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.
ఇక, జోరు మీదున్న క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌కి బ్రేకులేసింది కేంద్ర ప్రభుత్వం. క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటి వరకూ భారీ లాభాలతో పండుగ చేసుకుంటున్న క్రిప్టో కరెన్సీ ట్రేడర్స్.. ఇప్పుడు ఏకంగా 30శాతం పన్ను బాదుడుతో లబోదిబో మంటున్నారు. కేంద్ర ట్యాక్స్‌తో క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ భారీగా పడిపోవడం ఖాయమంటున్నారు.
ఆర్బీఐ ద్వారా త్వరలో డిజిటల్ కరెన్సీ తీసుకురానుంది కేంద్రం. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీ తీసుకొస్తామన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం వస్తుందన్నారు కేంద్ర మంత్రి. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి అవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ఆర్బీఐ ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.
ఇక, ఐటీ రిటర్న్‌ల దాఖలులో మరో వెసులుబాటు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్డేట్ చేసుకునే వెసులుబాటు అందించారు. అంటే రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు.
రాష్ట్రాలకు ఆర్థికసాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.


