TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాత కక్షలు పక్కన పెట్టి...

Published on: Fri Apr 27, 2018 12:16PM

 

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఓ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. అదేంటనుకుటున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 65 సంవత్సరాల తరువాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా  దేశాధినేతలు పాత కక్ష్యలకు పక్కన పెట్టి.. కరచాలనం చేసుకుని ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగుపెట్టారు. కొరియా యుద్ధం అనంతరం దాదాపు 65ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఈరోజు ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ద.కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ల మధ్య  సమావేశం జరిగింది. ఇరు దేశాలను వేరు చేసే సైనిక విభజన లైన్‌ వద్ద కిమ్‌ చిరునవ్వుతో మూన్‌ జే ఇన్‌తో కరచాలనం చేశారు. మూన్‌ కూడా చిరునవ్వుతో కరచాలనం చేస్తూ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

 

అనంతరం కిమ్‌ జోంగ్‌ ద.కొరియా అధ్యక్షుడిని తమ దేశంలోకి ఆహ్వానించడంతో మొదట మూన్‌ జే ఉ.కొరియా భూభాగంలోకి వెళ్లారు. ఇరువురు నేతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచారు. తర్వాత కిమ్‌ ద.కొరియాలో అడుగుపెట్టారు. ఉభయ కొరియాల సరిహద్దులోని శాంతి గ్రామం పన్‌ముంజుమ్‌లోని మూడంతస్థుల భవనం ‘పీస్‌ హౌస్‌’లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. యుద్ధం తర్వాత కొరియా దేశాల మధ్య చర్చలు జరగడం ఇది మూడోసారి. సమావేశం ప్రారంభానికి ముందు కిమ్‌ తాను ఎంతో ఉద్వేగానికి గురవుతున్నానని మూన్‌ జే ఇన్‌తో అన్నారు. ఇరు దేశాల మధ్య గొప్ప ఒప్పందం జరిగే అవకాశం ఉందని, ఇది కొరియా ప్రజలందరికీ చక్కటి బహుమతి అవుతుందని మూన్‌ అన్నారు. కిమ్‌తో పాటు ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా సదస్సుకు హాజరయ్యారు. ఇక ఇన్ని ఏళ్ల తరువాత వీరు కలవడంతో.. ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్న ఫొటోలను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి అంతర్జాతీయ మీడియాలు.  ఇదిలా ఉండగా మే లేదా జూన్‌ నెలలో లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు కూడా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు చెపుతున్నాయి అంతర్జాతీయ మీడియాలు. మొత్తానికి నేను మోనార్క్ ని.. నేను ఎవరి మాట వినను అన్న పంథాలో నియంతలా ఉండే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ విధమైన శాంతి చర్చలకు సహకరించడం గొప్ప విషయమే. మరి వారి శాంతి చర్చలు సఫలీకృతమవ్వాలని కోరుకుందాం..