అమెరికాకు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు...
Published on: Tue Mar 14, 2017 12:19PM

అగ్రరాజ్యమైన అమెరికాకు ఈ మధ్య వార్నింగ్ ల మీద వార్నింగ్ లు వస్తున్నాయి. ఇటీవలే ట్యాక్స్ విషయంలో అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. డబ్ల్యూటీవో నిబంధనలను పట్టించుకోకుండా తమ ఉత్పత్తులపై ట్యాక్స్‌లు విధిస్తే ఆ దేశంతో ట్రేడ్ వార్‌కు దిగుతామని.. 1930 లో తలెత్తిన ట్రేడ్ వార్ మరోసారి కనపడుతుందని హెచ్చరించింది. ఇప్పుడు తాజాగా ఉత్తర కొరియా కూడా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తమ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. వాయు, జల, భూమార్గాల ద్వారా జాలి లేకుండా దాడులు చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని ఆ దేశ అధికార న్యూస్ ఏజెన్సీ కేసీఎన్‌ఏ వెల్లడించింది. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న డ్రిల్స్‌లో భాగంగా నేవి సూపర్ క్యారియర్ 'కార్ల్ విన్సన్'ను యునైటెడ్ స్టేట్స్ మోహరిస్తున్న నేపథ్యంలో నార్త్ కొరియా ఈ విధంగా స్పందించింది. కార్ల్ విన్సన్‌ను మోహరించడం వెనుక తమ దేశంపై దాడి చేయాలనే కుట్ర దాగుందని ఉత్తరకొరియా మండి పడింది.


