కొరియా రెచ్చగొడుతోంది! యూఎస్ రెచ్చిపోతోంది! చైనా చిరాకుపడుతోంది!

 

ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం కేంద్రీకృతమైన చోటు ఉత్తర కొరియా. అక్కడ ఏ క్షణమైనా అమెరికా నిప్పుల వర్షం కురిపించవచ్చని చాలా మంది భావిస్తున్నారు. యుద్ధం వచ్చేది కాదు, అన్నీ ఒట్టి బెదిరింపులే అనేవారు ఇంకా వున్నారు. కాని, పైకి ఎవరు ఎన్ని మాటలు చెబుతున్నా లోలోన యుద్దం జరగదని నమ్మకమున్న వారు చాలా తక్కువ! చివరకు, ఇంత కాలం హాయిగా తమాషా చూస్తూ వచ్చిన చైనా కూడా ఇప్పుడు అమెరికా, కొరియాల మధ్య ఏం జరుగుతుందోనని బెంగ పడుతోన్నట్టు కనిపిస్తోంది!

 

ఒకవైపు మనతో డోక్లామ్ లో కోరి కొరివితో తల గొక్కుంటున్న చైనా ఉత్తర కొరియాను మాత్రం ఆ పని చేయొద్దని హెచ్చరిస్తోంది. అధికారికంగా కాకున్నా అక్కడి ప్రధాన పత్రికల సంపాదకీయాల్లో ఆ భావం వచ్చేలా రాయిస్తోంది. తాజాగా ఓ పత్రిక ఉత్తర కొరియాను సీరియస్ గా హెచ్చరించింది. యుద్ధం అమెరికా మొదలు పెడితే చైనా అడ్డుకుంటుంది తప్ప నార్త్ కొరియా బలుపుతో అడుగు ముందుకు వేస్తే తాము ఏం చేయమని అంటోంది! ఇది చైనా పాలకుల మాట కాదు. కాని, కమ్యూనిస్టు చైనాలో పత్రికలు తమ స్వంత అభిప్రాయాలు రాయవనేది అందరికీ తెలిసిందే. అక్కడి రూలింగ్ పార్టీ అభ్రిపాయమే మీడియా చెబుతుంది!

 

గత వారం రోజుల్లో ట్రంప్ , కిమ్ ఇద్దరూ రెచ్చిపోయారు. పదే పదే తమని తట్టి లేపుతోన్న కొరియాపై అమెరికా గట్టి మాటలతో దాడి చేసింది. ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో నిప్పుల వర్షం కురిపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. దానికి కౌంటర్ గా ఉత్తర కొరియా నియంతృత్వ పాలకులు అమెరికా భూభాగమైన గువామ్ పై అణు దాడి చేస్తామంటూ బాధ్యతా రహితంగా మాట్లాడారు. దీంతో యుద్ధం తప్పదని అంతా భావించటం మొదలు పెట్టారు. మరో వైపు ఆస్ట్రేలియా లాంటి దేశాలు యుద్ధం వస్తే తాము అమెరికా వైపే అంటూ ప్రకటనలు కూడా చేసేస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియాలైతే ఎప్పట్నుంచో ఉత్తర కొరియా పని పట్టాలని కసిగా వున్నాయి!

 

ఇరు కొరియాలు విడిపోయి వుంటే ఎక్కువగా లాభపడేది చైనానే! అందుకే, నియంతృత్వంలో మగ్గుతోన్న ఉత్తర కొరియాకి ఎల్లప్పుడూ డ్రాగన్ సాయం అందుతూ వుంటుంది. అక్కడ కూడా ప్రజాస్వామ్యం వచ్చేస్తే ఇరు కొరియాలు అమెరికా పంచన చేరటం అనివార్యం. అది చైనాకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే, ఎప్పుడూ ఉతర్త, దక్షిణ కొరియాల నడుమ ఉద్రిక్తలు వుండాలనే కొరుకుంటుంది. కాని, ఇప్పుడు తీరా ట్రంప్ యుద్ధం చేసే ఆలోచనకు వచ్చే సరికి చైనా టెన్షన్ లో మునిగిపోయింది. ఎందుకంటే, మార్కెట్ అవసరాల దృష్ట్యా చైనా అమెరికాను ఎదుర్కొనే స్థితి ఇప్పడు లేదు. ఏక పక్షంగా అగ్ర రాజ్యం ఉత్తర కొరియా మీద దాడి చేసినా చైనా చేయగలిగింది చాలా తక్కువే! అందుకే, నార్త్ కొరియా రెచ్చగొట్టి అమెరికా కొరివితో తల గొక్కోవద్దని చైనా చెబుతోంది. ఒకవేళ యుద్ధమే మొదలైతే ఉత్తర కొరియాలో నియంతృత్వం కొనసాగటం అసాధ్యం. ఆ తరువాత చైనాకు మిగిలే లాభమూ శూన్యం!