యుద్ధాల దారి యుద్ధాలదే: నోబెల్ మాత్రం నాదే.. ట్రంపరితనం మామూలుగా లేదుగా.!
Published on: Thu Oct 8, 2026 11:40AM

ఈ సారి నోబెల్ శాంతి బహుమతి తనకే అంటున్నారు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్. తనకు నెబెల్ ఇవ్వకపోతే నోబెల్ కమిటీ పరువుపోతుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పరిశీలకులు మాత్రం ట్రంపరి తనానికి ఇది పరాకాష్ట అంటున్నారు. తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రపంచం మొత్తం ఎవరి పేరు వస్తుందా అని ఎదురు చూస్తుంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకెవరి పేరో ఏంటి.. తన పేరే అని ధీమాగా చెబుతున్నారు. నోబెల్ శాంతి బహుమతికి తనకు మించిన అర్హులెవరూ లేరని డంకా బజాయించి మరీ చెబుతున్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి రాకుంటే.. నోబెల్ కమిటీ పరువు గంగలో కలిసినట్లేనని చెబుతున్నారు ట్రంప్.
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎనిమిది ఘర్షణలను పరిష్కరించానని ట్రంప్ చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో ఇంతకు ముందు ఏ అధ్యక్షుడూ చేయని పని తాను చేశానని ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకుంటున్నారు. కే నోబెల్ శాంతి బహుమతి తనదేనని ఆయనకు ఆయనే ప్రకటించేసుకుంటున్నారు.

సాధారణంగా నోబెల్‌కు ఎవరైనా నామినేట్ చేస్తే.. నన్ను గుర్తించినందుకు ధన్యవాదాలు అంటారు. కానీ ట్రంప్ మాత్రం తనను నామినేట్ చేసే చాన్స్ ఎవరికీ ఇవ్వడం లేదు. నోబెల్ నాదే.. నాకు రావాల్సిందే అని తనకు తానే ప్రకటించేసుకుంటున్నారు. అదే నామినేట్ చేయడం అనుకోమంటున్నారు. తనను తానే ప్రమోట్ చేసుకుంటూ.. తనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వకుంటే నోబెల్ కమిటీ పరువుపోతుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నోబెల్ శాంతి పురస్కారం కోసం నోబెల్ కమిటీని బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ నేతలు తనను నోబెల్‌కు నామినేట్ చేశారని ఆయన చెప్పుకుంటున్నారు. వాస్తవానికి నోబెల్ నామినేషన్లు గోప్యంగా ఉంటాయి. దీంతో ట్రంప్ చెప్పుకుంటున్నట్లుగా కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్ధాన్ దేశాలు ట్రంప్ ను నిజంగా నోబెల్ శాంతి పురస్కారం కోసం నామినేట్ చేశారనడం ధృవీకరణకు నిలవదు. ఇక ట్రంప్ తనకు తాను పరిష్కరించానని చెప్పుకుంటున్న ఘర్షణలు తలెత్తడానికే ట్రంప్ కారణమన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది.
ట్రంప్ శాంతి బహుమతి కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో.. 2026 జనవరిలో తన నోబెల్ పతకాన్ని ట్రంప్‌కు బహూకరించారు. ఇదిగో.. మీకు కూడా నోబెల్ వచ్చేసింది అన్నట్టుగా జరిగిన ఆ పరిణామాన్ని ట్రంప్ ఎంతో గౌరవంగా పేర్కొన్నారు. అయితే నోబెల్ బహుమతిని మరొకరికి బదిలీ చేయడం సాధ్యం కాదని నోబెల్ సంస్థ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో ట్రంప్ స్వయం ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టక తప్పలేదు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటికీ శాశ్వత పరిష్కారం రాలేదు. మరోవైపు ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ట్రంప్ శాంతి ప్రయత్నాలుగా పేర్కొంటున్న కొన్ని పరిణామాలు పూర్తిగా ముగిసిన యుద్ధాలుగా పరిగణించడానికి వీలులేదు.
ఇంతకీ నోబెల్ కమిటీ ఏం చేస్తుంది? అది ట్రంప్ చెప్పినట్టుగా తనకు ఇవ్వకపోతే కమిటీకే పరువు పోయే’ స్థితిలో ఉందా? లేక ఎప్పటిలాగే తన ప్రమాణాల ప్రకారమే నిర్ణయం తీసుకుంటుందా? సమాధానం త్వరలోనే రానుంది. 2026 నోబెల్ శాంతిబహుమతి విజేతను నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం (అక్టోబర్ 9) ప్రకటించనుంది.
మొత్తానికి.. ప్రపంచంలో చాలామంది నోబెల్ కోసం ఎదురు చూస్తారు. ట్రంప్ మాత్రం నోబెల్ తన కోసం ఎదురు చూస్తోందని చెప్పుటుంటూ సొంత డబ్బా వాయించుకుంటున్నారు. ప్రపంచ సంక్షోభానికి కారకుడిగా మారిన ట్రంప్ కు నోబెల్ వస్తే నిజంగానే నోబెల్ కమిటీ పరువు పోతుందని నెటిజనులు ఓ రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు.
[Nobel Pace Prize, Donald Trump, America President, Over Enthusiasm, Wars, Ukraine, Russia, Iran, Isreal, Telugu One]


