వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆరు నెలలు అనవసరం

 

వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని అనుకున్నాను గానీ పరిస్థితి వల్ల ఆ సమయం ఇవ్వలేమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాజాగా జరిగిన టీడీపీ ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యవహారాలపై ఆరు నెలలు మౌనంగా ఉండలేమన్నారు. బెదిరించే ధోరణి ఉన్నందున ప్రభుత్వానికి ఆరు నెలల సమయం అనవసరమని చంద్రబాబు అన్నారు. టీడీపి నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తారని, అన్నీ ఎదుర్కోవాలన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను సహించబోమని స్పష్టం చేశారు. సంఘీభావ ర్యాలీలతో టీడీపీ కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలని నేతలకు ఆయన సూచించారు.

శాసనసభలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా మండలిలో పార్టీకి బలం ఉందని, ప్రజాసమస్యలపై గట్టిగా పోరాడాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. 

అదేవిధంగా.. శాసనసభ, మండలిలో పదవులను చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఉంటారు. ఉపనేతలుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య, రామానాయుడు, విప్‌గా బాలవీరాంజనేయులును నియమించారు. మండలిలో ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడు, ఉపనేతలుగా డొక్కా, సంధ్యారాణి, జి. శ్రీనివాసులు, విప్‌గా బుద్దా వెంకన్న నియామకాన్ని చంద్రబాబు ఖరారు చేశారు.