మోదీ గెలిచి ఓడటం, చంద్రబాబు ఓడి గెలవటం… ఖాయమే!

టీడీపీ పంతం నెగ్గించుకుంది! చంద్రబాబు వ్యూహం ఫలించింది! అవిశ్వాస రాజకీయం మోదీని కార్నర్ చేయగలిగిందనే చెప్పాలి! నిజానికి స్వంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటిన ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోవాల్సి రావటమే ఒక మైనస్ పాయింట్. అందులోనూ తమతో నాలుగేళ్లు కలిసి సాగిన టీడీపీ లాంటి పార్టీయే అవిశ్వాసం పెట్టటం మోదీకి ఇబ్బందికర పరిస్థితే. అందుకే, గత పార్లమెంట్ సమావేశాల్లో రోజుల తరబడి సమయం వృథా అయినా ప్రధాని చర్చకు సిద్ధపడలేదు. కానీ, అది రివర్స్ రిజల్ట్స్ ఇచ్చింది. మీడియాలో, దేశ వ్యాప్తంగా కూడా మోదీ ప్రతిపక్షాల ప్రశ్నలకి భయపడుతున్నారని ప్రచారం జరిగింది. మళ్లీ ఈసారి కూడా పోయిన సారిలాగే టీడీపీ అవిశ్వాస అస్త్రం ఎక్కుపెట్టడంతో మోదీ చర్చకు దిగి రాక తప్పలేదు…

 

 

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందంటూ రాష్ట్రంలో అన్ని పార్టీలు నిరసనలు చేస్తున్నాయి. కానీ, పార్లమెంట్ వేదికగా ఉద్యమిస్తేనే దేశమంతా గమనిస్తుంది. అందుకే, టీడీపీ పోరుబాట ఎంచుకుంది. కానీ, ఏపీలో ప్రధాన ప్రతిపక్షం మాత్రం తప్పులో కాలేసింది. జగన్ తన ఎంపీల చేత రాజీనాలు చేయించి ట్రాప్ లో పడ్డారు. ఇప్పుడు మోదీ అవిశ్వాసం పై చర్చకు సై అనటంతో టీడీపీ ఎంపీల స్వరమే లోక్ సభలో వినిపించనుంది. జనం తరుఫున మాట్లాడే అవకాశం వైసీపీకి లేకుండా పోయింది. ఈ విషయంలో టీడీపీదే పై చేయి అయిందని చెప్పుకోవాలి…

 

 

టీడీపీ, వైసీపీ మధ్య పోటీ పక్కన పెడితే చంద్రబాబు గత కొన్ని రోజులుగా బీజేపిని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీయే విలన్ అని జనానికి చెప్పగలిగారు. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా అదే మరింత స్పష్టం కానుంది. ఖచ్చితంగా బీజేపీ నేతలు, ప్రధాని కూడా తీవ్ర స్థాయి ఎదురు దాడికి సిద్ధమయ్యే చర్చకు ఒప్పుకుని వుంటారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే, కాషాయ దళం ఎంత ప్రతి దాడి చేసినా ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం అనే ప్రధానమైన తప్పిదం మాత్రం కప్పిపుచ్చలేనిది. జనం ఆ విషయం గుర్తిస్తే చంద్రబాబు అవిశ్వాస వ్యూహం ఫలించినట్లే!

 

 

అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చ జరగటం, ప్రధాని సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వటం ఎప్పుడైనా మామూలే. అయితే, చివర్లో ఓటింగ్ జరిగి ప్రభుత్వాలు కూలుతుంటాయి. అంతటి పరిస్థితి ఇప్పుడైతే లేదనే చెప్పాలి. మోదీ సర్కార్ కూలటం దాదాపు అసాద్యమే. ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్ కే కేవలం 44 సీట్లు వుండటం, టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఎంతగా ప్రతిఘటిస్తున్నా టీఆర్ఎస్, అన్నాడీఎంకే లాంటి పార్టీలు లోపాయికారిగా కేంద్రానికి సాయపడుతుండటం, వైసీపీ కూడా తన ఎంపీల రాజీనామాతో మోదీకి హెల్ప్ చేయటం… ఇలాంటి బోలెడు కారణాలున్నాయి! వీటన్నిటి వల్ల బీజేపీకి ఇప్పటికిప్పుడు నష్టం లేన్నట్టే. కానీ, టీడీపీతో సహా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన పార్టీలు, మద్దతిస్తున్న పార్టీలు మాత్రం జనం ముందు దిల్లీ పెద్దల్ని దోషులుగా నిలిపే ఛాన్స్ వుంటుంది. అంత వరకూ చంద్రబాబు ఇతర నేతలు సక్సెస్ అయినట్టే!