వైసీపీ సిట్టింగులకు టిక్కెట్టు లేనట్టే.. మరి పార్టీ పరిస్థితి ఏంటో.!!

ప్రత్యేకహోదా కోసం అంటూ వైసీపీ ఎంపీలు ఐదుగురూ వారి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈ రాజీనామాల పుణ్యమా అని సానుభూతి ఏమో కానీ ఆ ఐదుగురు ఎంపీలకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.. ఒకవైపు రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తుంటే, మీరేమో రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోని అవే పార్లమెంట్ సమావేశాలు టీవీలో చూస్తున్నారు అంటూ విమర్శలు మూటగట్టుకున్నారు.. ఈ విమర్శలు చాలవన్నట్టు ఇప్పుడొక పెద్ద షాక్ తగిలింది.. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ మినహా మిగిలిన నలుగురు ఎంపీలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది.

 

 

నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై నిర్వహించిన సర్వే ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయట.. దీంతో ఆయన స్థానంలో ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డిని బరిలోకి దించి, మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఉదయగిరి నుంచి బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారట.. అయితే ఈ విషయంపై ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.. ఒకవేళ చంద్రశేఖర్ కి టిక్కెట్టు ఇవ్వకపోతే టీడీపీలో చేరాలని ఆయన వర్గీయులు ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం.. నిజానికి మేకపాటి కుటుంబంలో చంద్రశేఖర్ కే ఎక్కువ బలం ఉంది.. మరి ఆయన్ని కాదని టిక్కెట్టు రాజమోహన్ కి ఇస్తే, ఆయన భారీ అనుచరగణంతో టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.. ఇది పార్టీకి తీవ్ర నష్టం.. దీంతో అధినాయకత్వం ఆలోచనలో పడిందట.

 

 

ఇక ఒంగోలు ఎంపీగా ఉన్న జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డి టిక్కెట్టుకి ఎసరు తప్పేలా లేదు.. ఆయనకి టిక్కెట్టు ఇచ్చేదిలేదని, విజయవాడలో ఉండి పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలని జగన్ చాలాకాలం క్రితమే చెప్పినట్టు సమాచారం.. ఆయన స్థానంలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారట.. జిల్లానేతలు కూడా మాగుంట వస్తే మంచి అభ్యర్థి అవుతారని, ఆయన చేరితే తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.. అలాగే మాట్లాడితే పవన్, మాకు వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తారని వ్యాఖ్యలు చేసే తిరుపతి ఎంపీ వరప్రసాద్ కి కూడా ఈసారి టిక్కెట్టు దక్కేలా లేదు.. ఆయన స్థానంలో కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుందరరాజు అనే అధికారికి దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

 

 

ఇక కడప ఎంపీ స్థానం అయితే రోజుకో మలుపు తిరుగుతుంది.. ఈసారి అవినాష్ కి టిక్కెట్టు కష్టమే అంటున్నారు.. ఈ విషయంపై కుటుంబంలో తీవ్ర విభేదాలు కూడా తలెత్తినట్టు సమాచారం.. అవినాష్ స్థానంలో జగన్ బాబాయ్ వివేకానందకు బరిలోకి దింపాలని చూస్తున్నారట.. ఒకవేళ ఆయన కాకపోతే షర్మిలకి టిక్కెట్టు ఇవ్వాలన్న ఒత్తిడి కూడా పెరుగుతుందట.. కొందరేమో అవినాష్ కి టిక్కెట్టు ఇవ్వమని, కొందరేమో ఇవ్వొద్దని.. కొందరేమో వివేకానందకి కడప ఎంపీ టిక్కెట్టు అని, కొందరేమో నంద్యాల ఎమ్మెల్యే టిక్కెట్టు అని.. కొందరేమో షర్మిలకు కడప ఎంపీ టిక్కెట్టు అని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తుండటంతో, అందరూ కుటుంబ సభ్యులు కావడంతో జగన్ కి ఏం చేయాలో తోచక తల పట్టుకుంటున్నారట.. ఇక మిగతా ఎంపీ స్థానాల్లో కూడా జగన్ కి తలనొప్పి తప్పట్లేదట.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు గాని ఎంపీ అంటే అంత ఖర్చు మా వల్ల కాదని వెనకడుగు వేస్తున్నారట.. 70, 80 కోట్లు ఖర్చు పెట్టలేమని చేతులు ఎత్తేస్తున్నారట.. జగన్ మాత్రం పార్టీ నుండి ఏమి ఆశించకుండా సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకునే వారినే తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.