కాంగ్రెస్ కు కలిసొచ్చే మీడియా ఏదీ?
Published on: Tue May 15, 2012 11:16AM
తమ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే మీడియా ఏదీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని కార్యకర్తలే తమ గురించి ప్రచారం చేయాలని ఆయన కోరారు. ఇప్పటి దాకా మీడియాపై వ్యాఖ్యలు చేయని సిఎం ఒక్కసారిగా ఎందుకు అలా గుర్తు చేసుకున్నారనేది పరిశీలించాలి. ఆయన కడప జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సాక్షి పత్రికలో కాంగ్రెస్ గురించి వ్యతిరేకంగా రాశారని కొందరు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి కార్యకర్తల ముందేమీ మాట్లాడని సిఎం ఆ తరువాత సమావేశంలో మీడియాపై తన ఆందోళనను బహిరంగపరిచారు. ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎన్. టివి వంటివి తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే జగన్ సొంతంగా సాక్షి పత్రిక, ఛానల్ నడుపుతున్న విషయాన్ని గుర్తుచేసేలా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం సొంత మీడియా గురించి ఆలోచించలేదనీ, భవిష్యత్తులో ఈ తరహా ఆలోచన చేయటానికీ వెనుకాడదనే అర్థం కూడా సిఎం ప్రసంగం నుంచి వస్తోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. త్వరలో ఈ తరహా ప్రయత్నాలు సిఎం కిరణ్ హయాంలోనే సాధ్యమని వారు అభిప్రాయపడుతున్నారు.


