TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కవితకు కల్వకుంట్ల ఫ్యామిలీ అండ కరవైందా?

Published on: Thu Mar 9, 2023 8:42AM

కల్వకుంట్ల కవిత మాజీ అయినా, ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినా,  తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినా,  ఏమైనా ఆమెకు ఆ స్థాయి రావడానికీ, రాజకీయంగా ఒక గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం మాత్రం ఆమె కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కావడమే. రాజకీయంగా ఆమె ఎదుగుదలకు, ఆమెకు పదవులు దక్కడానికి తొలి కారణం ఆమె కేసీఆర్ కుమార్తె కావడమే.  

ఔను ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలను ఎదుర్కొంటూ, ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న కవిత తెలంగాణ ముఖ్యమంత్రి,  భారాస అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె. రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుట్ల తారకరామా రావు సోదరి. కల్వకుట్ల కుటుంబ సభ్యురాలు.  వాస్తవానికి ఆమె రాజకీయానికి పునాది  ఆమె కుటుంబం.  కేసీఆర్ లేనిదే తెలంగాణ వచ్చేదో లేదో కానీ, కేసీఆర్ లేకుంటే కవిత రాజకీయ జీవితం ఇన్ని ఎత్తుపల్లాలను చూసేదే కాదు. ఆమె రాజకీయ గుర్తింపునకు ఎలా చూసుకున్నా కేసీఆరే కర్త, కర్మ, క్రియ.కేసీఆర్ కుమార్తె అన్న గుర్తింపుతోనే ఆమె రాజకీయంగా ఎదిగారు.

ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె చిక్కులు ఎదుర్కోవడానికి ఆమె కేసీఆర్ కుమార్తె కావడమే కారణం అనడంలో సందేహం లేదు. మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉండటం, లేకపోవడం పక్కన పెడితే..  కేసీఆర్ అనే మూడక్షరాలు కవిత రాజకీయంగా ఎదగడానికీ, ఇప్పుడు చిక్కుల్లో ఉండటానికి కూడా  కారణం అనడంలో సందేహం లేదు. అదలా ఉంటే.. ఇప్పుడు ఆ కేసీఆర్ కవితకు అండగా నిలుస్తున్నారా? నిలవగలుగుతారా? ఆమెను చిక్కుల్లోంచి బయటపడేయగలుగుతారా అంటూ మాత్రం ఔనన్న సమాధానం మాత్రం రావడం లేదు.

తెలంగాణ రాజకీయాల్లో ఫస్ట్ ఫ్యామిలీగా, రాజకీయంగా తిరుగులేదని భావించే కల్వకుంట్ల కుటుంబం  ఢిల్లీ మద్యం  కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కల్వకుంట్ల కవితను దూరం పెట్టిందా? ఆ కుంభకోణంలో కవిత పాత్ర ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. ఆ కుంభకోణం మచ్చ ఇటు పార్టీకి, అటు కుటుంబానికి అంటకుండా ఉండేందుకు  కల్వకుంట్ల కవితతో పార్టీ పరంగా లేదా కుటుంబ పరంగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోందా? అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. అందుకే తెలంగాణ జాగృతి  అండ కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.  

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే  కవిత తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం? ఇప్పుడు ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు ఆమె వాయిదా కోరడానికి భారత జాగృతి ధర్నాకారణంగా చెప్పడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఆమె ఈ కుంభకోణంలో సీబీఐ విచారణను ఎదుర్కొనడానికి ముందు న్యాయసలహా తీసుకోవడం దగ్గర నుంచి సలహా సంప్రదింపుల వరకూ ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో జరిగాయి. అదే ఈడీ విచారణ దగ్గరకు వచ్చేసరికి ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు కనీసం ప్రగతి భవన్ కు వెళ్లి తండ్రి కేసీఆర్ తో భేటీ కూడా కాలేదు. తన నివాసం నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లారు. ఆమెకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈడీ నోటీసులు ఇచ్చినా.. తండ్రి కేసీఆర్ కానీ, సోదరుడు కేటీఆర్ కానీ కనీసం ఖండించలేదు. సంఘీభావంగా ఆమె నివాసానికి వెళ్ల లేదు. ఈ ఆరోపణలను కవిత ఒంటరిగానే ఎదుర్కొంటుందన్న సంకేతాలు ఇచ్చేలా వ్యవహరించారు.

సరే కేసీఆర్ అయితే పార్టీ అండగా ఉంటుందన్న ఒక్క ముక్కతో ముక్తాయించేశారు. కొందరు నాయకులు, మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి కవితకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శుక్రవారం (మార్చి 10) జరిగే ధర్నాలో పాల్గొనేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు గురువారం హస్తినకు బయలుదేరుతున్నారు. అంతే పార్టీ పరంగా కవితకు దక్కిన మద్దతు, అండ ఇంతే. ఈ విషయాన్ని గుర్తించడం వల్లనే ఆమె గత కొన్ని రోజులుగా తనపై కేసు, విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ జాగృతి, భారత్ జాగృతిల అండతో మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారని పరిశీలకులు అంటున్నారు.