జగన్ ప్రత్యేకహోదాని అటక ఎక్కిస్తారా?

 

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెబుతూ వస్తున్నారు. అయితే ఇక నుంచి అడిగే అవసరం లేకుండా జగన్ కి కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. ఏపీకే కాదు అసలు ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదంటూ మోదీ సర్కారు తేల్చి చెప్పింది. లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు రాతపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. దేశంలోని ఏపీ, తెలంగాణలతో పాటు మొత్తంగా ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని.. అయితే ఏపీ సహా ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని నిర్మలా తేల్చి చెప్పారు.

గతంలో చంద్రబాబు హయాంలో కూడా  మోదీ సర్కార్ హోదా ఇచ్చేది లేదని చెప్పడంతో.. బాబు మొదట ప్యాకేజీకి ఒప్పుకున్నారు, తరువాత హోదా కావాలని బీజేపీ మీద పోరాటం చేసారు. హోదా విషయంలో బాబు యూటర్న్ తీసుకున్నారని, హోదా సాధించలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు మోదీ సర్కార్ హోదా విషయంలో తమ వైఖరి మారదని, హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఆసక్తి నెలకొంది. బీజేపీతో సన్నిహితంగా ఉంటూ హోదాని అటక ఎక్కిస్తారా? లేక బాబు లాగా బీజేపీ మీద పోరాటానికి సిద్దమవుతారో చూడాలి. మొత్తానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజులకే హోదా విషయంలో జగన్ కి మోదీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.