కేసీఆర్ ను పట్టించుకున్న పత్రికే లేదు
Published on: Wed Feb 2, 2022 1:13PM
అనుకున్నది ఒకటైతే,అయింది వేరొకటి. తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ బడ్జెట్ రియాక్షన్ పేరిట కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా రెండున్నర గంటల పాటు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో భావయుక్తంగా, బడ్జెట్ ను , కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలలో ముంచెత్తారు. ముఖ్యంగా, జాతీయ మీడియాను ఆకట్టుకునే గట్టి ప్రయత్నం చేశారు. అయితే, ఆయన శ్రమ వృధా అయింది. జాతీయ మీడియా కేసీఆర్ మారథాన్ ప్రెస్ మీట్’ను అసలు పట్టించుకోలేదు. చివరకు, హైదరాబాద్’లో ఎడిషన్’ ఉన్న జాతీయ పత్రికలలోనూ, కేసీఆర్ రెండున్నర గంటల కంఠశోషకు సింగిల్ కాలమ్’ స్పేస్ కూడా దొరకలేదు.. వివరాలలోకి వెళితే ..
కొత్త విషయం కాదు. పాత ముచ్చటే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై కన్నెర్ర చేయడం. కత్తులు దూయడం కొత్త విషయం కాదు. గతంలోనూ అనేక సందర్భాలలో ఇలాగే, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని కడిగి పారేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే అదే సమయంలో, ఎన్ని సందర్భాలలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారో అన్ని సందర్భాలలోనూ, యూ టర్న్ తీసుకున్నారు. పిల్లి మొగ్గలు వేశారు.అందుకే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. “హైదరాబాద్’లో తిట్టుడు, ఢిల్లీలో మొక్కుడు” అంటూ కేసీఆర్ మీడియా డ్రామాను ఒక్క ముక్కలో తేల్చేశారు. నిజానికి, రేవంత్ రెడ్డి అన్నారని కాదు గానీ, ఇటీవల కాలంలోనే కేసీఆర్ యూ టర్న్ ఉదంతాలు వరసగా తెరకెక్కుతూనే ఉన్నాయి.
హుజూరాబాద్ పరాభవం తర్వాత, ఒక రోజు కాదు, వరసగా రెండు మూడు రోజులు మీడియా సమావేశాలు పెట్టి, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, టార్గెట్’ గా చాలా చాలా తీవ్ర విమర్శలు చేశారు. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిట్లు తిట్టారు.యుద్ధం ప్రకటించారు. ఆ వెంటనే ఢిల్లీ వెళ్లి మూడు నాలుగు రోజులు మాట ముచ్చట లేకుండా మౌనంగా కాలక్షేపం చేసి వట్టి చేతులతో తిరిగొచ్చారు.
అంతకు ముందు కూడా కేసీఆర్, ఇలాంటి ప్రహసనాలే ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలోనే ఒకటికి రెండు సార్లు స్టాండ్ మార్చుకున్నారు. ముందు వ్యతిరేకించారు. కేటీఆర్, సహా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కి ధర్నా చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో సమర్ధించారు. ఆ తర్వాత మళ్ళీ వ్యతిరేకించారు.
అదలా ఉంటే, నిన్న (సోమవారం) కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్’ పై స్పందించిన సందర్భంగా మరింతగా చెలరేగిపోయారు. కేంద్రం ఫై మరో సారి నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీవి కురచ బుద్ధులని ఎద్దేవా చేశారు. ఛీ.. కొట్టారు. గుండె మడుతోందని.. My heart is bleeding’ అంటూ బాధను వ్యక్తీకరించారు. బీజేపీని చుట్టచుట్టి హిందూ మహాసముద్రంలో పరేయాలని అఅన్నారు. బీజేపీ ముక్త భారత్’కు సమయం ఆసన్నమైందని రణ నినాదం చేశారు. రాజ్యాంగాన్నే మార్చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్’ రాసిన రాజ్యాంగాన్ని అవతలకు నెట్టి, కొత్త రాజ్యాంగం తీసుకు రావలసిన అవసరం ఉందని, తీసుకు వస్తానని అన్నారు. ఇంతవరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలకు పాలన తెలియదని, పనికిమాలిన పాలన అందించారని విరుచుకుపడ్డారు. ఇంకానా .. ఇకపై అలాంటి పాలన సాగదని .. ‘దేశం కోసం కదిలి వస్తున్నా..’ అని ప్రకటించారు.
నిజానికి కేసీఆర్ కేంద్రంపై ఎంతగా విరుచుకు పడినా, ఎన్ని విన్యాసాలు చేసినా, సుమారు రెండున్నర గంటల పాటు సాగిన మీడియా సమావేశం సారాంశం మాత్రం ఒక్కటే ... ఢిల్లీ చలో. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ ప్రయత్నం వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నారా.. ఇంకొకరు ఉన్నారా అనేది పక్కన పెడితే, కేసీఆర్ మారథాన్ ప్రెస్ మీట్ లక్ష్యం..జాతీయ మీడియాను ఆకర్షించడం. అందుకోసమే ఆయన, తెలుగులోనే కాకుండా, ఇంగ్లీష్, హిందీలోనూ మాట్లాడారు.
అయితే, కేసేఆర్ శ్రమంతా వృధా అయింది. జాతీయ పత్రికలు ఏవీ కేసీఆర్ కంఠశోషను పట్టించుకోలేదు. చివరకు హైదరాబాద్’ లో ఎడిషన్ ఉన్న జాతీయి పత్రికలలో కూడా, కనీసం సింగిల్ కాలమ్ వార్త కూడా రాలేదు. ఒకటి రెండు పత్రికలో మాత్రం బడ్జట్ రియాక్షన్స్’లో, ‘ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా.. అంటూ ఒకటి రెండు ముక్కలు ఇచ్చి వదిలేశారు. అంటే, కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షలు... వన్ సైడ్ లవ్’ లానే ఉన్నాయని అంటున్నారు.
నిజానికి, గతంలోనూ కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే ప్రయత్నాలు చేశారు. కానీ, మమత మొదలు నవీన్ పట్నాయక్ వరకు, అఖిలేష్ మొదలు స్టాలిన్ వరకు, చివరకు వామపక్షాలు కూడా, కేసీఆర్’ తో చేతులు కలిపేందుకు, నో. అనేశాయని, మీడియాలో వార్తలొచ్చాయి. అందుకే, రాజ్యాంగం మార్చేద్దాం అనే సంచలన ప్రకటన చేశారు. అయితే, ఇప్పుడు అది కూడా బూమ్రాంగ్ అయినట్లు తెలుస్తోంది. రాజ్యాంగాన్ని మార్చడం అంటే అంబేద్కర్’ను అవమానించడమే అనే కోణంలో చర్చ జరుగుతోంది. అందుకే ఢిల్లీలో తెరాస ఎంపీ సురేష్ రెడ్డి, హైదరాబాద్’లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, వినోద్ కుమార్ డ్యామేజి కంట్రోల్ పనిలో పడ్డారు.


