పొత్తుల ఊసే లేని తెలంగాణ
Published on: Mon Jun 6, 2022 5:46PM
ఒక వైపు ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల ముందే పొత్తల రచ్చ రగులుతుండగా, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే తెలంగాణలో మాత్రం ఆ ఊసే వినిపించడం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకే సిద్ధ పడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోరు అనివార్యమని భావిస్తున్ననేపథ్యంలో పార్టీల ఒంటరి పోరు, పొత్తుల ఊసే లేని తీరు ఏ పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందన్నది పరిశీలకులకు సైతం అంతుబట్టడం లేదని అంటున్నారు.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు తెరాస ఎన్నికల పొత్తు పెట్టుకుని పోటీలో దిగినప్పటికీ ఆవిర్భావం వాత మాత్రం ఒంటరిగానే ఎన్నికల రణరంగంలోకి దిగి విజయాలు సాధించింది. గత రెండు ఎన్నికలలో మాదిరే ఈ సారి కూడా తెరాస ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ ఇటు టీఆర్ఎస్ తో కానీ, అటే కాంగ్రెస్ తో కానీ పోత్తు అవకాశాలే లేవు. కనుక ఆ పార్టీ కూడా అనివార్యంగానే ఒంటరి పోరుకు దిగాల్సి ఉంటుంది.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. గత ఎన్నికలలో పొత్తులతో దెబ్బ తిన్న ఆ పార్టీ ఈ సారి సొంత బలంపైనే నమ్మకం పెట్టుకుంది. సో ఈ సారి తెలంగాణలో పార్టీలన్నీ ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగి బలాబలాలను పరీక్షించుకోనున్నాయి. వైఎస్సార్టీపీ, బహుజన సమాజ్ వంటి చిన్నా చితకా పార్టీలు పొత్తల ఆలోచన చేసినా వాటి వల్ల ప్రయోజనం, ఫలితం ఏమీ ఉండని పరిస్థితి. ఎంఐఎం రంగంలో ఉన్నా ఆ పార్టీ పాత బస్తీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకూ పరిమితం.ఇక రాష్ట్రంలో తెలుగుదేశం ఏదో ఉన్నాదంటే ఉన్నది అంతే. ఆ పార్టీకి కార్యకర్తల బలం ఉన్నా, నడిపించే నాయకులు కరవైనారు.
ఇక రాష్ట్రంలో తమ స్టేక్ ను బలంగా చాటుతూ ఎన్నికల రణరంగంలో నిలబడేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలు మూడే అని చెప్పాలి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మూడూ కూడా వేటికవే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి సత్తా చాటాలని భావిస్తున్నాయి. మూడు పార్టీలూ కూడా వేటికవే అధికారం చేజిక్కించుకోగలనన్న విశ్వాసం, ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ లో సహజంగానే ఉండే గ్రూపు తగాదాలు, విభేదాలు అలాగే ఉన్నా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని గెలుపు ధీమా ఆ పార్టీలో కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో మాత్రం అధికారం కోసం ఎన్నికల పోటీలో గట్టిగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీకి పట్టణ ప్రాంతాలలోనే చెప్పుకోవడానికి వీలైన పట్టు ఉందనీ, గ్రామీణ ప్రాంతాలలో పెద్దగా స్టేక్ లేదనీ ఇంతకాలం పరిశీలకులు విశ్లేషిస్తూ వచ్చారు. అయితే గత కొంత కాలంగా బీజేపీ గ్రామీణ ప్రాంతాలలోనూ చెప్పుకోదగినంతగా బలోపేతం అయ్యిందని ఇప్పుడు చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం. కేంద్ర పథకాలనే తెలంగాణ సొంత పథకాలుగా చెప్పుకుని ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర నేతలు ఓ స్థాయిలో చేసిన ప్రచారం ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇక అధికార టీఆర్ఎస్ విషయానికి వస్తే గత రెండు ఎన్నికల్లో సునాయాస విజయాలను సాధించిన పార్టీకి ఈ సారి గెలుపు అంత సులువుగా లభించదని అంటున్నారు. వరుసగా రెండు పర్యాయాలు, అంటే గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతను ఆ పార్టీ గట్టిగా ఎదుర్కొనవలసినపరిస్థితి ఉందంటున్నారు. అయితే గత ఎనిమిదేళ్లుగా చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమా తెరాసలో వ్యక్తం అవుతున్నది.


