TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో సమ్మె-బిగుసుకుంటున్న పీటముడి

Published on: Tue Feb 1, 2022 3:13PM

ఏపీలో ఉద్యోగ సంఘాలు, జగన్ సర్కారు మధ్య పీటముడి  బిగుసుకుంటోంది. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ చర్చలు అసంపూర్తిగా ముగియడమే అందుకు తార్కాణంగా చెబుతున్నారు. ఎవరి ప్రతిపాదనలు వారు ప్రకటించారే తప్ప ఎవరూ ఎవరికీ తలొగ్గిన దాఖలాలు కనిపించలేదు. చర్చల కోసం స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు అందుబాటులో ఉండాలని మంత్రుల కమిటీ ముందుగా సమాచారం అందించింది. దీంతో వారంతా మంత్రుల కమిటీ ఎదుట హాజరై చర్చించేందుకు రెడీ అయ్యారు. సమావేశం దరిమిలా మంత్రుల కమిటీ ముందు స్టీరింగ్ కమిటీ మూడు ప్రతిపాదనలు ఉంచింది. అశుతోష్ మిశ్రా రిపోర్టు బయట పెట్టాలని, పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని, పాత జీతాలే వేయాలని స్టీరింగ్ కమిటీ కోరింది. అయితే ఆ విషయాలు పట్టించుకోని మంత్రుల కమిటీ చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని, ఈ (మంగళవారం) సాయంత్రానికి ఉద్యోగులందరికీ జీతాలు పడతాయని మంత్రులు కోరారు. అయితే జీతాల విషయంలో తొందర ఎందుకని, తాము ప్రతిపాదించిన సమస్యల పరిష్కారం తరువాతే తదుపరి కార్యాచరణపై చర్చిస్తామని, అప్పటివరకు తమ డిమాండ్లకే కట్టుబడి ఉన్నామని స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు తేటతెల్లం చేశారు. దీంతో ప్రభుత్వం ఏమాత్రం తమ పంతం నుంచి తగ్గలేదని, ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించే అవకాశమే లేదనేది తేటతెల్లమైందన్న అభిప్రాయాలు స్టీరింగ్ కమిటీ నుంచి వినిపిస్తున్నాయి. 

అటు ఉద్యోగులు సైతం తమ పంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్న విషయాన్ని తమ డిమాండ్లను మరోసారి వినిపించడం ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఫలితంగా ఫిబ్రవరి 7 కు జరిగే చలో విజయవాడ కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసినట్లయింది.