దగా..మోసం.. బయటపడిన జగన్ సర్కార్ మరో నయవంచన!
Published on: Fri Aug 5, 2022 6:10AM
మూడు రాజధానులంటూ.. అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్.. అసలు మూడు రాజధానుల నిర్మాణానికి ఈ మూడేళ్లలో వేసిన అడుగు ఒక్కటీ లేదని పార్లమెంటు సాక్షిగా రుజువైపోయింది. అమరావతి అభివృద్ధిని ఆపేయడం.. విశాఖలో భూములను దోచేయడం అన్న లక్ష్యంతోనే జగన్ ఈ మూడేళ్లూ గడిపేసిందన్న సంగతిని కేంద్రం పార్లమెంటులో తేటతెల్లం చేసేసింది. న్యాయ రాజధాని కర్నాలు అంటూ వైకాపా ఇంత వరకూ చెబుతూ వస్తున్నదంతా శుద్ధ అబద్ధమని తేలిపోయింది.
కర్నూలుకు హైకోర్టు తరలింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ మూడేళ్లలో ఒక్క ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి అందలేదు. ఈ విషయాన్నికేంద్రం పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. తెలుగుదేశం ఎంపీ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రాత పూర్వక సమాధానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం అమరావతిలో ఏర్పాటైంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిలో ఏర్పాటైన హైకోర్టు వాస్తవానికి 2019 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తోంది. అయితే ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించడానికి ముఖ్యమంత్రి జగన్ 2020లో ఒక ప్రతిపాదనను తీసుకువచ్చారు.
మూడు రాజధానులలో భాగంగా న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్ారు. అయితే అందుకోసం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానాలు నిలువరించాయి. మూడు రాజథానులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.
దీంతో అసలు ఇప్పటి వరకూ హైకోర్టు తరలింపు ప్రతిపాదనలనే ప్రభుత్వం సిద్ధం చేయలేదు. వాస్తవానికి హైకోర్టు తరలింపునకు ఎటువంటి చట్టం చేయనవసరం లేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి .. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ముందుఅడుగు వేయవచ్చు. అయితే జగన్ సర్కార్ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు.


