సీనియారిటీ వద్దు, సిన్సియారిటీ ముద్దు.. జగన్ మార్క్ పాలిటిక్స్

 

రాజకీయాల్లో సీనియారిటీకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి అనుభవాన్ని, సేవలను ఉపయోగించుకోవడానికి పార్టీ అధినేతలు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి మిగతా వాళ్లకంటే అవకాశాలు కాస్త సులువుగా దక్కుతుంటాయి. ఏపీ నూతన మంత్రివర్గం విషయంలోనూ ఇదే జరుగుతుందని, గతంలో మంత్రులుగా పని చేసిన పలువురికి మంత్రి పదవులు గ్యారంటీగా దక్కుతాయని విశ్లేషకులు భావించారు. కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం మంత్రివర్గ కూర్పు విషయంలో భిన్నంగా ఆలోచించారు. సీనియారిటీ కంటే ఎక్కువగా.. పార్టీకి, తనకు విధేయులుగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చారు. 

శ్రీకాకుళం జిల్లా నుంచి వైసీపీ తరపున విజయం సాధించిన మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి విజయం సాధించిన ఆనం రామనారాయణరెడ్డి.. సీనియర్లు కావడంతో జగన్ కేబినెట్‌లో వారికి చోటు ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ధర్మాన ప్రసాదరావు స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌కు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ కాంగ్రెస్ వీడిన సమయంలోనే ఆయనతో పాటు ధర్మాన ప్రసాదరావు వెళ్లలేదు. కానీ ధర్మాన కృష్ణదాస్ మాత్రం గెలిచినా, ఓడినా జగన్ వెంటే ఉన్నారు. దీంతో జగన్ ధర్మాన బ్రదర్స్‌లో కృష్ణదాస్‌కే తన కేబినెట్‌లో చోటు కల్పించారు. 

ఇక నెల్లూరు జిల్లా నుంచి మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కేబినెట్‌లో చోటు ఖాయమనే టాక్ వినిపించింది. అయితే జగన్ మాత్రం ముందు నుంచి తనతో ఉంటూ వస్తున్న బీసీ సామాజికవర్గానికి చెందిన యువనేత అనిల్ కుమార్ యాదవ్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ రకంగా తన కేబినెట్‌లో సీనియారిటీ కంటే ఎక్కువగా విధేయతకే పెద్దపీట వేశారు జగన్.