భూమన, రోజాలను పక్కన పెట్టిన జగన్.. వారిద్దరే ఎందుకు?

 

ఏపీ నూతన మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి సీనియర్‌ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, కళత్తూరు నారాయణస్వామికి చోటు దక్కింది. కాగా జిల్లా నుంచి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు, ప్రజలు ఊహించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాలకు అవకాశం దక్కలేదు.

జిల్లాలో వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలిచి, రెండు ఎన్నికల్లో టీడీపీని దీటుగా ఎదుర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్థానం దక్కింది. వైఎస్‌ మరణం నాటికి మంత్రిగా వున్న పెద్దిరెడ్డి.. వైసీపీ ఆవిర్భవించాక పార్టీలో కీలక పాత్ర పోషించారు. జిల్లాలో మూడున్నరేళ్ళ పాటు సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని, ఆ తర్వాత ఐదేళ్ళ పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబును సమర్ధవంతంగా ఎదుర్కొని జిల్లాలో వైసీపీ బలం తగ్గకుండా కాపాడుకున్నారు. సత్యవేడు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, మదనపల్లె, తంబళ్ళపల్లె, పీలేరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి వారి గెలుపు దాకా భారం ఆయనే వహించారు. అలాగే చిత్తూరు ఎంపీ సీటు విషయంలోనూ అభ్యర్థి ఎంపిక, గెలుపు బాధ్యత తీసుకున్నారు. పార్టీకి ఆయన అందించిన విలువైన సేవలను పరిగణనలోకి తీసుకున్న జగన్‌ మంత్రివర్గంలో పెద్దిరెడ్డికి అవకాశం కల్పించారు.

జిల్లాలో తొలి నుంచీ వైఎస్‌ వర్గీయుడిగా ముద్ర పడిన జీడీనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి జగన్‌ పట్ల కూడా అత్యంత విధేయత చూపించారు. దాని ఫలితంగానే పార్టీ ఆయనకు పట్టం కట్టింది. వైఎస్‌ మరణానంతరం జగన్‌ పక్షాన చేరారు. వైసీపీకి ఆవిర్భావం నుంచీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నారాయణస్వామిని మాజీ సీఎంలు కిరణ్‌, చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీకి అధ్యక్షుడిగా నియమించడం ద్వారా జగన్‌ ఆయనకు తనవద్ద వున్న ప్రాధాన్యత ఏపాటిదో చాటి చెప్పారు. నారాయణస్వామి కూడా రెండు ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిచి సొంత బలాన్నీ చాటుకున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం జగన్‌ కీలకమైన ఈ జిల్లా నుంచీ నారాయణస్వామికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.

అయితే పార్టీ పరంగానూ, వైఎస్‌ కుటుంబంతోనూ సాన్నిహిత్యం కలిగిన భూమన కరుణాకరరెడ్డికి, రోజాకు తొలి విడత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్‌కు సన్నిహితుడిగా పేరుగాంచిన కరుణాకరరెడ్డికి ఆయన సీఎం కాగానే తుడా ఛైర్మన్‌గా అవకాశమిచ్చారు. ఆ తర్వాత టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. 2009 ఎన్నికల్లో వైఎస్‌ ఆయనకు తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇచ్చారు. 2012 ఉప ఎన్నికల్లో జగన్‌ సైతం ఆయనకే టికెట్‌ ఇచ్చారు.తర్వాత ఆయన వైఎస్‌ కుటుంబంతో బంధుత్వం కూడా కలుపుకున్నారు. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే కరుణాకర రెడ్డికి ప్రాధాన్యత వుంటుందని రాజకీయవర్గాలు భావించాయి. అలాగే రోజా విషయానికొస్తే ఆమె పార్టీ గళాన్ని బలంగా వినిపించారు. అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొని సస్పెన్షన్‌కూ గురయ్యారు. నగరిలో వరుస ఎన్నికల్లో ముఖ్యనేత ముద్దుకృష్ణమను, ఆయన తనయుడు భానుప్రకాష్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. ఈ నేపధ్యాలతో వీరిద్దరికీ మంత్రి పదవులు వస్తాయని అందరూ భావించారు. కానీ జగన్‌ జాబితాలో వారిరువురి పేర్లూ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇతర జిల్లాలు, సామజిక వర్గాల ప్రాధాన్యతలు దృష్టిలో ఉంచుకునే జగన్ వీరిద్దరికి తొలి విడత మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదని తెలుస్తోంది.