ఫొటో గ్రాఫర్ లేడా.. అయితే పెళ్లి క్యాన్సిల్!
Published on: Tue May 31, 2022 1:34PM
పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి అవి సిల్లీ కారణాలతో కూడా పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతాయి. అటువంటి సిల్లీ కారణంతో పీటల మీద పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది ఓ పెళ్లి కూతురు. ఇంతకీ కారణమేమిటంటే పెళ్లి కుమారుడి తరఫు వారు ఫొటో గ్రాఫర్ లేకుండా పెళ్లికి తరలి రావడమే.
ఫొటోలు లేకుండా పెళ్లేమిటని పెళ్లి కూతురికి కోపం వచ్చింది. అంతే ఇంకేముంది పెళ్లి క్యాన్సిల్ అంటూ భీష్మించుకు కూర్చుంది. పెళ్లి మంటపం నుంచ లేచి వెళ్లిపోయి పక్కింట్లో కూర్చుంది. ఎంత బతిమలాడినా పెళ్లి మంటపానికి రావడానికి ససేమిరా అంది. పెళ్లికి ఫొటోలే తీయించలేని వాడితో పెళ్లేమిటని నిలదీసింది.
ఈ సంఘటన కాన్పూర్ లో జరిగింది. చివరికి పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. వారు నచ్చ చెప్పినా పెళ్లి కూతురు వినలేదు. ఫొటోలు లేని పెళ్లి తనకు వద్దే వద్దంది. దీంతో పోలీసులు కూడా చేసేదేం లేక చేతులెత్తేసారు. చివరికి ఇరు కుటుంబాల వారూ పెళ్లి కోసం పరస్పరం ఇచ్చి పుచ్చుకున్న కానుకలను వెనక్కు ఇచ్చేసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.


