‘ కిక్కు ‘ ఇవ్వని కొత్త పాలసీ!
Published on: Fri Jul 20, 2012 8:50AM
కొత్తపాలసీ ద్వారా మద్యం అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను హైకోర్టు అభినందించింది. అయితే ఎక్సయిజ్‌శాఖ మాత్రం పీకల దాకా కూరుకు పోయామని, పాతపాలసీని కాదని కొత్త చిక్కుల్లో పడ్డామని భావిస్తోంది. లక్కీడీప్‌లు, లాటరీలు తీసినా కొన్ని మద్యం దుకాణాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాక పోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎపిబిసిఎల్ అవుట్‌లెట్‌లకు సిద్ధమైన ఎక్సయిజ్ వాటికి సిబ్బందిని నియమించటం పెద్దసవాల్‌గా మారిందని భావిస్తోంది.
ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ కొన్ని మద్యం దుకాణాలు మిగిలిపోయాయి. దీని ఫలితంగా తొలిత్రైమాసికం నష్టం దాదాపు 2500కోట్ల రూపాయలు అని లెక్క తేలింది. ప్రత్యేకించి లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించినా ఎంఆర్‌పి ధరల కన్నా ఎక్కువకు అమ్మేస్తున్నారన్న ఆరోపణలు పలు ప్రాంతాల నుంచి గుప్పుమంటోంది. మళ్లీ ఎంఆర్‌పి సమస్య మొదలైందా అని ఎక్సయిజ్ తలలు పట్టుకుంటోంది. రాష్ట్రం మొత్తం మీద 6596 మద్యం దుకాణాలకు గతనెలలో తొలిసారి లక్కీడీప్ నిర్వహిస్తే 900 దుకాణాలు మిగిలిపోయాయి. ఈ నెల 3న మళ్లీ లాటరీ తీస్తే వాటిలో 678 దుకాణాలు మిగిలాయి. ఈ నెల 12న మూడోసారి లాటరీ తీస్తే ఇంకా 635దుకాణాలు మిగిలే ఉన్నాయి.
కేవలం 43దుకాణాలు మాత్రమే మంజూరు చేయగలిగారు. మొత్తం 39 డిపోల ద్వారా మద్యం సరఫరా జరుగుతోంది. పదిచోట్ల ఎపిబిసిఎల్ రాష్ట్ర మద్యపానీయాల సంస్థ కౌంటర్లు ఏర్పాటు చేసింది. దీని తరువాత మిగిలిన దుకాణాల స్థానంలో ఔట్‌లెట్లు ఏర్పాటు చేస్తోంది. ఎమ్మెల్యేల కమిటీ సూచనలు పాటించి కొత్త మార్పులు చేశాక నష్టం తప్పలేదని ఎక్సయిజ్ శాఖ ఆందోళన చెందుతోంది. మార్పు అనేది జరిగింది కాబట్టి ఫలితాలు రావటానికి కొంత సమయం వెచ్చించక తప్పదని ఆ శాఖకు పలువురు సూచనలిస్తున్నారు. అవుట్‌లెట్లు కనుక విజయవంతమైతే ఎక్సయిజ్‌శాఖకు కొంత ఊరట లభించవచ్చని పలువురు భావిస్తున్నారు.


