'హనీమూన్' లేదు..ప్రజల కోసమే: మోడీ

 

నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సరిగా నెలరోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో తన ప్రభుత్వం కనబరిచిన పనితీరు పట్ల నరేంద్రమోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ పాలనలో విశేషాలను తెలియజేస్తూ ఐదున్నర నిమిషాల వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు.

 

 

 

ప్రభుత్వానికి కొంతకాలం విమర్శలు ఎదుర్కోని విధంగా 'హనీమూన్ కాలం' ఉంటుందని మీడియా మిత్రులు చెబుతుంటారు. గత ప్రభుత్వాలు వందరోజులు, అంతకంటే పైగానే ఈ సౌలభ్యాన్ని అనుభవించాయి. కానీ, మా ప్రభుత్వం దీనికి నోచుకోలేదు. వంద రోజులు పక్కనపెడితే... వంద గంటల్లోనే తీవ్రమైన ఆరోపణలు మొదలయ్యాయి. కానీ... దేశ ప్రయోజనాల కోసం పూర్తి నిబద్ధతతో, ఆత్మసాక్షిగా సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలేవీ లెక్కలోకి రావు. మేం తీసుకున్న కఠిన నిర్ణయాలు మాపట్ల ఈ దేశ ప్రజలకున్న ఘనమైన అభిమానాన్ని కొంత తగ్గించి ఉండొచ్చు. కానీ, మేం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చిన రోజున ఈ ప్రేమాభిమానాలు పూర్వస్థాయిలోకి వస్తాయి.



67 సంవత్సరాల గత పరిపాలనను ఈ ఒక నెల పాలనతో పోల్చలేం. అయితే... మేమంతా గత నెలరోజుల్లో ప్రతి క్షణం ప్రజల సంక్షేమంగురించే ఆలోచించామని, ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనాల కోసమే తీసుకున్నామని చెప్పగలను. నెలరోజుల క్రితం పాలనా పగ్గాలు చేపట్టినప్పుడు అంతా కొత్తగా అనిపించింది. కేంద్రప్రభుత్వ పనితీరు గురించి తెలుసుకోవడానికి నాకు కనీసం ఏడాది, రెండేళ్లు పట్టవచ్చునని కొందరు భావించారు. కానీ, అదృష్టవశాత్తూ ఇప్పుడు నా మదిలో ఆ (కొత్త అనే) ఆలోచనే లేకుండా పోయింది. ఈ నెల రోజుల వ్యవధిలో ఆత్మవిశ్వాసం, అంకితభావం గణనీయంగా పెరిగాయి. మంత్రివర్గ సహచరుల తెలివితేటలు, అనుభవజ్ఞానం, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఇందుకు తోడ్పడ్డాయి.