TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నానిలు, అనిల్‌లు.. క‌రివేపాకులేనా?

Published on: Tue Apr 12, 2022 3:26PM

జ‌గ‌న‌న్న జ‌గ‌న‌న్న అంటూ మూడేళ్లు భ‌జ‌న చేశారు. మంత్రులుగా రాష్ట్ర‌మంతా ఊరేగారు. విప‌క్షంపై విరుచుకుప‌డ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడారు. తీవ్ర స్థాయిలో మాట‌ల‌ దాడి చేశారు. బూతుల మంత్రిగా మిగిలిపోయారు. ఇంతా చేస్తే.. జ‌గ‌న‌న్న కోసం అంత‌గా అబాసుపాలైతే.. ఇప్పుడేం మిగిలింది? ఉన్న మంత్రి ప‌ద‌వి ఊడిపోయింది. 24 మంది రాజీనామాలు చేస్తే.. అందులో 10 మందిని మ‌ళ్లీ కేబినెట్‌లోకి తీసుకున్నారు. కానీ, నోరున్న ఆ ముగ్గురికి మాత్రం మ‌రో ఛాన్స్ ఇవ్వ‌లేదు. అస‌లు నోరే ఎత్త‌ని పెద్దిరెడ్డిని, నోరు తిర‌గ‌ని బొత్స‌ను, ప‌నికిరాని ప‌లువురికి మ‌ళ్లీ మంత్రిగా అంద‌లం ఎక్కించారని అంటున్నారు. కానీ.. మూడేళ్లుగా జ‌గ‌న‌న్న కోసం ఫుల్‌గా ఓవ‌రాక్ష‌న్ చేసిన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాద‌వ్‌ల‌ను మాత్రం ప‌క్క‌న‌పెట్టేశారని మండిప‌డుతున్నారు. మంత్రిగా ప‌నికి రాడ‌నే ముద్ర వేసేసి.. ప‌ద‌వి పీకేసి.. ప్ర‌జ‌ల ముందు ప‌రువు తీసేశారని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. న‌మ్ముకున్న ఆ ముగ్గురిని.. జ‌గ‌న‌న్న న‌ట్టేట ముంచేశారని పార్టీ వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. 

ఏపీ మినిస్ట‌ర్ అంటే.. ఇన్నాళ్లూ ముందుగా గుర్తొచ్చేది కొడాలి నానినే. త‌న బూతుల‌తో, చేష్ట‌ల‌తో అంత‌గా పాపుల‌ర్ అయ్యారు మ‌రి. సంక్రాంతికి గుడివాడ‌లో క్యాసినో న‌డిపించి.. గోవా రేంజ్ పాపులారిటీ తీసుకొచ్చారు. ఇక‌, ప్రెస్‌మీట్ల‌లో అమ్మ మొగుడులాంటి బూతుల‌తో.. టీడీపీ-చంద్ర‌బాబు-లోకేశ్‌ల‌పై తిట్ల‌తో విరుచుకుప‌డుతూ.. మంత్రి హోదాకున్న ఇమేజ్‌కి తూట్లు పొడుస్తూ.. మ‌హిళ‌లు చెవులు మూసుకునేలా చేస్తూ.. స‌భ్య స‌మాజం ముందు దోషిగా నిలుచున్నారు కొడాలి నాని. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగా ఆయ‌న ఏం ప‌ని చేశారో, ఏయే స‌మీక్ష‌లు నిర్వ‌హించారో ఎవ‌రికీ తెలీదు. కానీ, బూతుల మంత్రిగా మాత్రం అంద‌రికీ సుప‌రిచిత‌మే. జ‌గ‌న్ కోసం త‌న ఇమేజ్‌ని అంత‌గా డ్యామేజ్ చేసుకున్నా.. కొడాలికి మ‌రో ఛాన్స్ ఇవ్వ‌కుండా ద్రోహం చేశార‌ని నాని అభిమానులు లోలోన ర‌గిలిపోతున్నారు. జ‌గ‌న్‌పై విధేయ‌త క‌న్నా.. క‌మ్మ కావ‌డ‌మే.. కొడాలిపై వేటుకు కార‌ణ‌మా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

కొడాలి నాని అనే కాదు. వైఎస్ ఫ్యామిలీకి పెద్ద పాలేరున‌ని త‌న‌కు తాను ప్ర‌క‌టించుకున్న పేర్ని నాని ప‌ద‌వి కూడా పీకేయ‌డంతో జ‌గ‌న్‌పై సొంత‌పార్టీ నుంచే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కాపు మంత్రిగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సెటైర్ల‌తో కుమ్మేస్తూ.. సినిమా వాళ్ల‌ను తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ తిప్పిస్తూ.. మంత్రిగా జ‌గ‌న్‌ను మెప్పించిన పేర్ని నానిని సైతం ప‌క్క‌న పెట్టేయ‌డం దారుణం అంటున్నారు. ఇప్పుడిక పీకేను పీకే ఛాన్స్ ఏ మంత్రికి ఇస్తారో?

ఇక‌, ఇరిగేష‌న్ మినిస్ట‌ర్‌గా ఎవ‌రికీ తెలీని, నోరేసుకుని ప‌డే మంత్రిగా అంద‌రికీ తెలిసిన అనిల్ కుమార్ యాద‌వ్‌కు సైతం జ‌గ‌న‌న్న‌ హ్యాండివ్వ‌డం ఆస‌క్తిక‌రం. అస‌లు, అనిల్‌కుమార్‌కు మొద‌టిసారి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డ‌మే ఆశ్చ‌ర్యం అయితే, ప్రాజెక్టుల విష‌యంలో ఆయ‌న చేసిందేమీ లేక‌పోవ‌డం, అంతా సీఎం ఆఫీసు క‌నుస‌న్న‌ల్లోనే ఫైల్స్ అన్నీ క‌ద‌ల‌డం.. అనిల్ కేవ‌లం ఓ ర‌బ్బ‌ర్ స్టాంప్‌గా మిగ‌ల‌డం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న మంత్రిగా ప‌నికిరాక‌పోయినా.. క‌నీసం టీడీపీపై విమ‌ర్శ‌లు చేసేందుకైతే ప‌నికొచ్చేవాడని అంటున్నారు. ఆ కోణంలోనైనా ఆయ‌న‌కు మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తార‌నుకున్నా.. జ‌గ‌నన్న అనిల్‌ను అమ‌రావ‌తిలో అడ్ర‌స్ లేకుండా చేసి నెల్లూరుకు పార్సిల్ చేసేశార‌ని అంటున్నారు. 

అస‌లేమాత్రం అర్హ‌త లేకున్నా.. త‌మ‌ను మంత్రిగా అంద‌లం ఎక్కించార‌నే విష‌యం ఆ ముగ్గురికీ అర్థ‌మ‌య్యే ఉంటుంది. అందుకే, ఇప్పుడు ప‌ద‌వి పోయినా.. వాళ్లెవ‌రూ నోరెత్త‌డం లేదు. మిగ‌తా వారిలా అల‌గ‌డ‌మో, ర‌చ్చ చేయ‌డ‌మో చేయ‌ట్లేదు. క‌నీసం, త‌మ నాయ‌కుడి కోసం వారి అనుచ‌రులు కూడా రోడ్డెక్క‌లేదు. వాళ్ల‌కీ తెలుసు త‌మ నేత‌కు అంత సీన్ లేద‌ని. అందుకే, జ‌గ‌న‌న్న ఆ ముగ్గురిని క‌రివేపాకులా వాడుకొని వ‌దిలేశార‌ని అంటున్నారు. భ‌విష్య‌త్తులో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాద‌వ్‌ల‌కు ఏ ఇతర పదవులు ఇచ్చినా అవి మంత్రి పదవులతో మాత్రం సాటి రావు.