అలోక్ వర్మకి జరిగింది న్యాయమా? అన్యాయమా?

 

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలను విశ్వసించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఆయన్ని సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. కాగా సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) విచారణను సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ స్పష్టం చేశారు. కేవలం సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా చేసిన ఆరోపణ లపైనే అలోక్‌ వర్మపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ దర్యాప్తు జరిపి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిందని, ఆ నివేదికలోని అంశాలకు తనకు ఎంత మాత్రం సంబంధం లేదని పట్నాయక్‌ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను లిఖిత పూర్వకంగా సుప్రీం కోర్టుకు తెలియజేశానని చెప్పారు.

 

 

వర్మపై తీసుకున్న నిర్ణయాన్ని పునర్‌ సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టే ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీకి సూచించినప్పటికీ వర్మను తొలగిస్తూ ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకోవడం తొందరపాటేనని పట్నాయక్‌ అన్నారు. అన్ని అంశాలను అన్ని కోణాల నుంచి పరిశీలించి ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీవీసీ అభిప్రాయమే తుది అభిప్రాయం ఎందుకు అవుతుందని, విచారణను పర్యవేక్షించిన తన నివేదికను పరిగణలోకి తీసుకోవచ్చుగదా! అని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

అంతేకాకుండా అలోక్‌ వర్మపై సీవీసీ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా కూడా అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించి షాక్ ఇచ్చారు. అలోక్‌ వర్మపై వేటు గురించి ఆయన మాట్లాడుతూ సీబీఐపై రాజకీయ పెత్తనం కొనసాగినంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. విచారణను ఇటు సీవీసీ తరఫున అటు సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన జస్టిస్‌ లోధా, జస్టిస్‌ పట్నాయక్, ఇద్దరూ ఆధారాలు లేవని ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ నుంచి సుప్రీం కోర్టుకు, కోర్టు నుంచి ప్రధాని కార్యాలయానికి నివేదిక ఎలా వెళ్లిందనేదే ఆలోచించాల్సిన విషయం. ఇంతకీ జస్టిస్‌ పట్నాయక్ ఇచ్చిన నివేదికను సుప్రీమ్ కోర్టు ప్రధాని కార్యాలయానికి పంపిందా లేదా?...ఒకవేళ పంపితే  దాన్ని పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నారా?  అనేదే సందేహం..

 

 

మరోవైపు ఇదే కేసుతో సంబంధం ఉన్న సీబీఐ స్సెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానా తరఫున సీవీసీ ఛైర్మన్‌ కేవీ చౌదరి రాయబారం నడిపినట్లు తెలుస్తోంది. ఆస్తానాపై చేసిన అవినీతి ఆరోపణలను వెనక్కి తీసుకోవాల్సిందిగా అలోక్‌ వర్మను కోరారని, దీని కోసం ఆయన స్వయంగా వర్మ ఇంటికి వెళ్ళినట్లు ఓ వార్త పత్రిక వెల్లడించింది.  చౌదరి తన ఇంటికి వచ్చిన అంశాన్ని జస్టిస్‌ పట్నాయక్‌కు అలోక్‌ వర్మ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆ పత్రిక రాసింది. రాకేష్‌ ఆస్తానాపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుంటే... అంతా సర్దుకుంటుందంటూ వర్మకు చౌదరి చెప్పారు. ఈ విషయాన్ని కూడా వర్మ తన లేఖలో రాశారు. మోడీ మనిషిగా ముద్రపడిన రాకేష్‌ ఆస్తానా తరఫున లాబీయింగ్‌ చేసిన చౌదరి.. .సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికలో తన ప్రయత్నాల గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఇదంతా రహస్యంగా జరిగిందని ఆ పత్రిక పేర్కొంది. అసలు దేశంలో ఏం జరుగుతోంది ఎవరిని నమ్మలేని పరిస్థితి. దోషి ఎవరో నిర్దోషి ఎవరో?..నిజాన్ని కప్పిపుచ్చుతున్నారా లేక అబద్దాన్ని మసి పూసి మారేడు కాయలా చూపిస్తున్నారా...?.. ఇప్పుడు మంచితనం,మానవత్వం వెతుక్కుంటున్నాం రాబోయే రోజుల్లో న్యాయం ఉందో? లేదో? వెతుక్కోటానికి సిద్దమవుదాం..!