TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా విమానాలకు నో ఎంట్రీ.. స్పెయిన్ సంచలన నిర్ణయం

Published on: Tue Mar 31, 2026 10:48AM

పశ్చిమాసియాలో  యుద్ధ వాతావరణం నేపథ్యంలో స్పెయిన్ అమెరికాకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఆ దేశ విమానాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. స్పెయిన్ గగనతలంలోకి అమెరికా విమానాలను అనుమతించేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో పాలుపంచుకునే అమెరికా విమానాలకు తమ గగనతలంలోకి అనుమతి లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.  అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా సాగుతున్న ఈ పోరాటంలో  తాము భాగస్వామి కాదలచుకోలేదని క్లారిటీ ఇచ్చింది. 

 స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరెటా రొబెల్స్  ఈ మేరకు ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఏ రకమైన సైనిక కార్యకలాపాలకు తమ భూభాగాన్ని లేదా గగనతలాన్ని వినియోగించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి సైనిక స్థావరాలను పశ్చిమాసియా ఘర్షణల కోసం వాడటాన్ని స్పెయిన్ వ్యతిరేకిస్తోంది. ఏకపక్షంగా జరుగుతున్న ఈ దాడులకు సహకరించకూడదనే ఉద్దేశంతోనే ఈ  నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ మొదటి నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలంటున్నారు. 

అదలా ఉంటే..  స్పెయిన్   నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.  స్పెయిన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఈ పరిణామం  నాటో  దేశాల మధ్య  సమన్వయంపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  యూరప్ దేశాల్లో ఒకటైన స్పెయిన్.. అమెరికాకు వ్యతిరేకంగా ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.  స్పెయిన్ పై  ఈ కారణంతో అమెరికా  ఆంక్షలు విధిస్తే..  అది స్పెయిన్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు. 

ఇక ఇరాన్ అయితే.. స్పెయిన్ నిర్ణయాన్ని స్వాగతించింది.  పశ్చిమాసియాలో శాంతిని కోరుకునే దేశాలన్నీ కూడా అమెరికా దూకుడును అడ్డు కోవడానికి స్పెయిన్ లా ముందుకు రావాలని కోరింది. స్పెయిన్ అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకుందని ప్రశంసల వర్షం కురిపించింది.