కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాస తీర్మానం

 

నిన్నవెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా పూర్తిగా జీర్ణించుకోక ముందే, దానినెత్తిన మరో పిడుగు పడబోతోంది. ఈ రోజు డిల్లీలో సమావేశమయిన కాంగ్రెస్ యంపీలు లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, సాయి ప్రతాప్, హర్షకుమార్, యస్పీవై రెడ్డి, సబ్బంహరి తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెచ్చేందుకు లేఖపై సంతకాలు చేసారు. ఈ రోజు సాయంత్రంలోగా దానిని స్పీకర్ మీరా కుమార్ కి అందజేయనున్నారు. కానీ చిరంజీవి, పురందేశ్వరి, కిల్లి కృపా రాణీ, జేడీ శీలం, కావూరి, పళ్ళంరాజు తదితరులు మాత్రం వేనుకంజవేసినట్లు తెలుస్తోంది.

 

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశ పెట్టాలంటే కనీసం 55 మంది సభ్యుల మద్దతు తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్ యంపీలు స్వయంగా తమ స్వంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నారు గనుక సభలో ఇతర పార్టీల సభ్యులు కూడా దానికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. స్పీకర్ కాంగ్రెస్ యంపీల అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి అంతకంటే అవమానం మరొకటి ఉండబోదు.

 

ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో ఓటమితో క్రుంగిపోతున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఇది జీర్ణించుకోవడం కష్టమే. గనుక వారిని బుజ్జగించే పని మొదలుపెడుతుందేమో! అప్పుడు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు వారు కోరినట్లు తెలంగాణా బిల్లులో ఏమయినా మార్పులు చేర్పులకి అంగీకరిస్తే అప్పుడు టీ-కాంగ్రెస్ నేతలు అవిశ్వాసం ప్రతిపాదిస్తారేమో చూడాలి. ఏమయినప్పటికీ సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలు ఆమె పుట్టిన రోజున చాలా అరుదయిన కానుక సమర్పించుకొంటున్నారని ఒప్పుకోక తప్పదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu