TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీన్మార్ మల్లన్నపై మరో కేసు.. జైలు నుంచి బయటికి రాకుండా కుట్రలా?

Published on: Sat Sep 11, 2021 8:38PM

కేసీఆర్ ప్రభుత్వానికి కొంత కాలంగా కొరకరాని కొయ్యగా మారిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. బెదిరింపుల కోసం ఆగస్టు 26న తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. తర్వాత పోలీసులు నాలుగు రోజుల పాటు మల్లన్నను కస్టడీలోనికి తీసుకుని విచారించారు. బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోనికి తీసుకుని ప్రశ్నించారు. 

తీన్మార్ మల్లన్నపై కేసులు కూడా పెరిగిపోతున్నాయి. మల్లన్నను తమను బెదిరించాడంటూ కేసులు వస్తుండటంతో పోలీసులు ఫైల్ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు 31 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. మల్లన్నపై కక్ష గట్టిన కేసీఆర్ ప్రభుత్వం.. వీలైనన్ని ఎక్కువ రోజులు జైలులుో ఉంచేలా కుట్రలు చేస్తుందని మల్లన్న టీమ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు మద్దతుగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.మ‌ల్ల‌న్న‌కు పార్టీల‌కు అతీతంగా వివిధ ప్ర‌ముఖుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. మల్లన్నకు సపోర్ట్ పెరిగిపోతుండటంతో ఆయనపై మరిన్ని కేసులు పెట్టించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

మల్లన్న అనుచరులు చెబుతున్నట్లే ఆయనపై కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా  తీన్మార్ మల్లన్నపై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్‌స్టేషన్‌లో  కేసు నమోదైంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను ఏ5గా పేర్కొంటూ కేసు నమోదు చేసినట్టు బోధన్ ఏసీపీ రామారావు తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన కల్లు ముస్తేదార్ జయవర్ధన్ గౌడ్‌ను రూ. 20 లక్షలు చెల్లించాలని బెదిరించినందుకు క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎడపల్లి మండలం జానకంపేట్‌కు చెందిన తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు ఉప్పు సంతోష్‌ను ఏ1గా, ఏ2గా రాధా కిషన్, ఏ3గా రాజా గౌడ్, సాయగౌడ్ ఏ4, చింతపండు నవీన్ కుమార్‌ను ఏ 5గా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు.

కేసు వివరాలను కూడా వెల్లడించారు ఏసీపీ రామారావు. కల్లు ముస్తేదారు జయవర్ధన్ గౌడ్‌ను జూన్ నెల నుండి డబ్బుల కోసం అదే గ్రామానికి చెందిన కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. వారి బెదిరింపులకు భయపడి జయవర్ధన్ గౌడ్ ఆగస్టు నెలలో రూ. 5 లక్షలు చెల్లించారని, తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఉందని మిగతా 15 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో వేధింపులు తాళలేక గురువారం ఫిర్యాదు చేశారన్నారు. దీంతో తాము ఈ ఘటనకు బాధ్యులైన మల్లన్నతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.  ఈ కేసులో ఉప్పు సంతోష్‌ను అరెస్టు చేయగా, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. తీన్మార్ మల్లన్నపై పిటీ వారెంట్ జారీ చేసే యోచనలో ఉన్నామన్నారు ఏసీపీ రామారావు.ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడినా, బ్లాక్ మెయిల్ చేసినా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ సూచించారు.