నిజామాబాద్ ను శాసిస్తున్న ఇసుక,మద్యం,కల్లు మాఫియాలు
Published on: Wed Feb 15, 2012 4:14PM
ని
జామాబాద్: నిజామాబాద్ జిల్లాను ఇసుక, మద్యం,కల్లు మాఫియాలు శాసిస్తున్నాయి. వీరికి అధికార పార్టీ మంత్రులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. నిజామాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి నిత్యం లక్షలాది రూపాయల విలువైన ఇసుక మహారాష్ట్ర, మెదక్, హైదరాబాద్ వైపు తరలిపోతుంది. మద్యం విషయానికొస్తే టెండర్ల సమయంలో పోటీలుపడి షాపులు దక్కించుకున్న వ్యాపారులు ఆ తరువాత సిండికేట్ గా ఏర్పడి దందాకు పాల్పడుతున్నారు. మద్యం ధరలను విపరీతంగా పెంచడం, మద్యం ప్రియుల నుంచి రోజుకు రూ.30 లక్షలు అదనంగా దోచుకోవడం, జీరో మద్యం విక్రయించడం తదితర చర్యలకు సిండికేట్లు ఒడిగట్టారు. జిల్లా వ్యాప్తంగా 142 అనుమతి పొందిన షాపులు ఉంటే, 5 వేలకు పైగా అనధికార బెల్టు షాపులున్నాయి. ఎక్కడచూసినా మద్యం ప్రియుల్ని దోచుకోవడమే. ఎమ్మార్పి ప్రకారం ఒక రోజు టర్నోవర్ కోటి రూపాయలు జరుగుతోంది. 30శాతం ధర పెంచి రోజుకు రూ.30 లక్షలు అదనపు దోపిడీ చేస్తున్నారు. కల్లు మాఫియాది ఇదే తరహా దందా. జిల్లా అంతగా కలిసి మూడులక్షల లీటర్ల కల్లు ఉత్పత్తి జరగని పరిస్థితి ఉంటే రోజుకు 20 లక్షల లీటర్లకు పైగా కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. ఇదంతా కల్తీ కల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కల్తీ కల్లు తాగి పలువురు మృత్యువాత పడటం, వందలాది మంది అస్వస్తకు గురైన సందర్భాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ఈ రెండు దందాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ జిల్లాలో నిర్వీర్యమైపోయింది. డిప్యూటి కమీషనర్, సూపరింటెండెంట్ ల నుంచి మొదలు కానిస్టేబుల్ వరకు మామూళ్ళ మత్తులో అందరూ తమ విధులు మర్చిపోయారు. దీంతో వ్యవస్థ అంతా గాడితప్పింది. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేడు.


