TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుండె జారి గల్లంతయితే సస్పెండేనట

Published on: Thu Jul 18, 2013 9:50PM

 

“ఆమె ఓరకంట చూస్తూ ఒక చిరునవ్వు నవ్వితే ఎవరి గుండెయినా జారి గల్లంతవాల్సిందే. మరి అటువంటప్పుడు ఆ పైలట్లు మాత్రం గుండె నిబ్బరం చేసుకొని విమానం ఎలా నడపగలరు? మా భద్రత సంగతి గాలికొదిలేసి ఆమెతో ముచ్చట్లాడుతుంటే, అవతల మా గుండెలు గల్లంతయిపోయాయి మహాప్రభో!” అని ఒక విమాన ప్రయాణికుడు మొరపెట్టుకొంటే వెంటనే ఆ ఇద్దరు పైలట్లని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసేసారు.


ఇంతకీ ఆ కధా కమామిషు ఏమిటంటే, క్రింతటి నెల మన టాలివుడ్ అందాల భామ నిత్య మీనన్ బెంగుళూరు నుండి హైదరాబాద్ కి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్తూన్నపుడు, ఆ ముద్దు గుమ్మకి అసలు ఇంత పెద్ద విమానాన్ని కేవలం ఇద్దరు మనుషులు ఎలా నడుపుతారో తెలుసుకోవాలని కోరిక పుట్టింది. అంతే ఆమె నేరుగా కాక్ పిట్ వద్దకు వెళ్లి తలుపు మీద సుతారంగా టక్ టక్మని కొట్టగానే తలుపు తీసి బయటకి తొంగి చూసిన మన కుర్ర పైలట్లు జగన్, కిరణ్ (ముఖ్యమంత్రి, జగన్ మోహన్ రెడ్డి కాదు లెండి)లకి తమ కోసమే ఆకాశం నుండి దిగివచ్చిన (ఆ టైంకి వాళ్ళు కూడా ఆకాశంలోనే ఉన్నారనే సంగతి మరిచిపోయారు) అప్సరసలా తలుపు దగ్గిర నిలబడి, ఓరకంట చూసి నవ్వుతున్న నిత్యా మీనన్ కనబడగానే నిజంగానే వారి గుండెలు జారి గల్లంతయిపోయాయి. ఇంకేముంది, ఆమెను సాదరంగాలోనకి ఆహ్వానించి తమ పక్కన ఖాళీగా ఉన్నసీటులో (ఆ సీటు కేవలం విమాన శిక్షణ ఇచ్చే మాస్టర్లకి, లేదా అటువంటి వారికి మాత్రమే కేటాయించబడింది) కూర్చోబెట్టుకొని, ఆమె తన పెద్దకళ్ళను విప్పార్చి తమవైపే చూస్తుంటే, వారిద్దరూ ఆమెతో ఉల్లాసంగా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ అలా అలా గాలిలో తేలిపోతున్నట్లు (విమానమన్నాక గాలిలోనే తేలుతుందని అందరికీ తెలుసు. గానీ, ఆ రోజు మరింత బాగా తేలిపోయిందని ప్రయాణికుల అభిప్రాయం) విమానాన్ని అలవోకగా ఎడం చేత్తో నడిపి చూపించి ఆమె నుండి మరిన్ని ముసిముసి నవ్వులు రాల్చుకొని పరమానందపడిపోయారు మన కుర్ర పైలట్లు ఇద్దరూ. ఆ తరువాత ఆమె హైదరాబాద్ రాగానే వారికి ‘టాటా టాటా బై బై’ చెప్పేసి బ్యాగు ఊపుకొంటూ వెళ్లిపోయింది.

 

అయితే, ఆమె వచ్చి తనపక్కన కూర్చొంటే చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చునని ఆశపడి భంగపడిన ఒక ప్యాసింజరు, ఇదంతా చూసి ఓర్వలేక నేరుగా వెళ్లి బరబరా ఒక పిర్యాదు వ్రాసి పడేసాడు. అంతే ఇంకేముంది? ఇద్దరు కుర్ర పైలట్లని సస్పెండ్ చేస్తూ ఆర్డర్లు చేతిలో పెట్టేసారు సదరు విమాన సంస్థ వారు. ఇప్పుడు వారిద్దరూ ‘ఎంతపనిచేసావే నిత్యా!’ అంటూ ఆక్రోశిస్తున్నారు పాపం!