కుటుంబ రాజకీయాలకి చెల్లు చీటీ

 

రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలకు కొదవే లేదు.తమ తర్వాత తమ కుటుంబానికి చెందిన వారే ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటారు రాజకీయ నాయకులు.కానీ ఇందుకు భిన్నంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ కుటుంబ రాజకీయాలకు చెల్లుచీటి పాడారు.నితీశ్‌ కుమార్ ఇటీవల జేడీయూ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ని జేడీయూ ఉపాధ్యక్షుడిగా నియమించారు.ఇకనుంచి ఆయనది పార్టీలో రెండో స్థానం అని ఇతర నాయకులు, కార్యకర్తలకు సూచించారు.సీఎం నితీశ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను అధికారంలోకి తీసుకొచ్చిన వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ గుర్తింపు పొందారు.గత నెలలో జేడీయూలో ప్రశాంత్ కిశోర్‌ చేరినప్పుడే 'ఆయనే ఇకనుంచి పార్టీని నడిపిస్తాడని పార్టీ సభ్యులకు' నితీశ్‌ వెల్లడించారు.తన తరవాత స్థానం కిశోర్‌దేనని సూచన ప్రాయంగా వెల్లడించారు.

ప్రజారోగ్య నిపుణుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన కిశోర్‌ ఐరాస ఆధ్వర్యంలో నడిచిన అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు.అనంతరం భాజాపాకు దూరంగా జరిగిన ఆయన బిహార్‌లో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ను ఒక్కతాటి మీదకు తీసుకువచ్చి విజయాన్నికట్టబెట్టారు. ఈ సమయంలోనే నితీశ్‌, ప్రశాంత్ మధ్య సమన్వయం కుదిరిందని సమాచారం.డీఎంకే, సమాజ్‌వాదీపార్టీ లాంటి తదితర ప్రాంతీయ పార్టీలు తమ సంతానాన్నే రాజకీయ వారసులుగా ప్రకటించగా నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికారు.అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరకముందే అనగా రెండు నెలల క్రితమే 'పార్టీ భవిష్యత్ కార్యాచరణను కిశోర్‌ నిర్ణయిస్తారని' నితీశ్‌ చెప్పినట్లు సమాచారం.