నిందలు మోపిన ఏపీ బీజేపి! నితిన్ పొగడ్తల వర్షం!

ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపికి ఓ చిక్కు సమస్య వచ్చిపడుతోంది. ఒక్కసారి కాదు. పదే పదే వస్తోంది! అదేంటంటే… రాష్ట్ర బీజేపి నాయకులు కేసీఆర్ ని ఎడాపెడా విమర్శిస్తారు. ఆయన పాలన, పథకాలు దండగంటారు. కానీ, అంతలోనే కేంద్ర మంత్రులో, బీజేపీ పెద్దలో తెలంగాణకి వచ్చి సీఎం భేష్ అంటారు. పథకాలు సూపర్ అంటారు! ఇంకేముంది, టీ బీజేపీ నాయకులది కుడితిలో పడ్డ వ్యవహారం అవుతుంది! అయితే, తాజాగా ఏపీ బీజేపీ నాయకులకి కూడా పరిస్థితి అలాగే తయారైంది.

 

 

చంద్రబాబు నాలుగేళ్లు కమలంతో చెలిమి చేసినప్పుడు ఏపీ బీజేపీ నాయకులకి పెద్ద ఇబ్బందులు వుండేవి కావు. చంద్రబాబుని మిత్ర ధర్మంతో విమర్శించే వారు కాదు. జగన్ ను కూడా ఏమంత పెద్దగా టార్గెట్ చేయకుండానే బండి లాగించేసే వారు. కానీ, ప్రత్యేక హోదా విషయంలో బాబు సీరియస్ అయ్యాక పరిస్థితి తలకిందులైంది. రాత్రింబవళ్లూ టీడీపీని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకే, పూర్తి స్థాయిలో సోము వీర్రాజు లాంటి వారు బాబు మీద నోరు చేసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ కూడా రోజుకో ప్రెస్ మీట్ తో విరుచుకుపడుతున్నాడు. అయితే, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదన్న చంబ్రాబాబు ప్రశ్నకి ఎవరి వద్దా సమాధానం లేదు. అది పక్కన పెడితే… ఎలాగో మాటల గారడి చేసి ఏపీ సీఎంను ఇరుకున పెట్టినా… బీజేపీ పార్టీ అగ్రనేతలే రాష్ట్ర పార్టీ నాయకుల విమర్శలపై నీళ్లు చల్లుతున్నారు!

 

 

ఆంధ్రాలో పర్యటించిన నితిన్ గడ్కరీ చాలా వరకూ పాజిటివ్ కామెంట్సే చేశారు. భారీ నీటి పారుదల శాఖా మంత్రి అయిన ఆయన పోలవరం ప్రత్యక్షంగా సందర్శించారు. పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత విశాఖలోనూ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, వీటన్నటిలో ఏపీ బీజేపీ నాయకులకి పచ్చి వెలక్కాయల పరిణమించిన కామెంట్స్ … చంద్రబాబు గురించి నితిన్ గడ్కరీ అన్న మాటలే!

గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేసిన నితిన్ గడ్కరీ కేవలం మంత్రిగా మాట్లాడేస్తారని అనుకోలేం. కానీ, ఆయన ఎంతో రాజకీయ అనుభవం వున్నప్పటికీ చంద్రబాబుని నిజాయితీగా మెచ్చుకున్నారు. ఆయన విజనరీ అంటూ కితాబునిచ్చారు. పోలవరం విషయంలో బాబు పడుతోన్న తపన చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా ప్రత్యేక హోదా విషయంలో జరుగుతోన్న రచ్చ తెలియకుండానే చేసి వుంటారా? అస్సలు కాదు. టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో నేరుగా మోదీనే కారకుడ్ని చేస్తోందని తెలిసినా నితిన్ బాబుని మెచ్చుకున్నారు! ఇప్పుడు ఇదే ఏపీ బీజేపీ నాయకులకి మైండ్స్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది! తాము నిత్యం విమర్శిస్తోన్న అధికార పక్షాన్ని, సీఎంని తమ జాతీయ నేత, కేంద్ర మంత్రి పొగడ్తల్లో ముంచెత్తటం ఎవ్వరికీ జీర్ణం కావటం లేదు!

 

 

ఒకవైపు రాష్ట్ర నేతలతో తిట్టిస్తూ మరో వైపు జాతీయ నేతలతో పొగిడిస్తూ మోదీ, అమిత్ షా విచిత్ర రాజకీయమే నడిపిస్తున్నారు. దీని వల్ల చంద్రాబుకి వచ్చే నష్టమేం లేకున్నా ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఇరుకున పడుతున్నారు!