రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ఏకగ్రీవ ఎన్నిక

 

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణంతో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి నిర్మలా సీతారామన్‌ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ అటు లోక్ సభలోగానీ, ఇటు రాజ్యసభలో గానీ సభ్యురాలు కాదు. మంత్ర పదవి స్వీకరించిన ఆరు నెలలలో లోగా ఆమె పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒక దానికి ఎన్నిక కావలసి వుంటుంది. దీంతో నేదురుమల్లి మరణంతో ఖాళీ అయిన స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఆ స్థానానికి మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.