షాకింగ్.. తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న 108 డ్రైవర్ మృతి!
Published on: Wed Jan 20, 2021 3:04PM
భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే పలు రాష్ట్రాలలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా, తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గంటల్లోనే ఓ వ్యక్తి మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఒలా గ్రామానికి చెందిన విఠల్ రావు అనే వ్యక్తి 108 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మంగళవారం కుంటాల పీహెచ్‌సీలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే కుటుంబసభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విఠల్ మృతిచెందారు. వ్యాక్సిన్ తీసుకున్న గంటల్లోనే విఠల్ మరణించడంతో వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఆయన మృతికి కోవిడ్ వ్యాక్సినేషనే కారణమా? లేదా? అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమంటున్నారు డాక్టర్లు. మరోవైపు విఠల్ మృతిపై డైరెక్టర్ అప్ పబ్లిక్ హెల్త్ స్పందించారు. గుండెపోటుతో ఆయన మరణించారని ఓ ప్రకటన విడుదల చేశారు. విఠల్ మరణంపై విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


