మరోసారి వాయిదా పడనున్న నిర్భయ నిందితుల ఉరి...

నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి న్యాయం జరగకపోవడం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిర్భయ దోషులకు ఉరి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయటం సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నలుగురు దోషులలో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు దరఖాస్తు చేశాడు.రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశాడు నిందితుడు.జైలు నిబంధనల ప్రకారం రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని ఢిల్లి ప్రభుత్వం కోర్టుకు వివరించింది.కావున నిర్భయ దోషులను ఈ నెల 22 న ఉరి తీయలేమని ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు తీహర్ జైలు అధికారులు. ముఖేష్ క్షమాభిక్ష అభ్యర్ధతను రాష్ట్రపతి తిరస్కరించినా నిబంధనల ప్రకారం దోషులను ఉరి తీయడానికి ముందు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. 

నిర్భయ దోషులు కుంటి సాకులతో రోజులు పొడిగించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖేష్ క్షమాభిక్ష అభ్యర్ధను వీలైనంత త్వరగా తిరస్కరించాలసిందిగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ని నిర్భయ తల్లి ఆశాదేవీ కోరారు. లాయర్లు దోషులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను 7 ఏళ్ళుగా పోరాడుతున్న తన కూతురుకి న్యాయం జరగలేదని భారత న్యాయ వ్యవస్థ నిజంగానే గుడ్డిదని ఆశాదేవి ఆవేదనను వ్యక్తం చేశారు.నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయటంలో ఢిల్లీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండి పడ్డారు. ట్రైల్ కోర్టు ఆదేశాలకు అణుగుణంగా ఎట్టి పరిస్థితిలో నలుగురు దోషులను జనవరి 22 నే ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. మొత్తానికి నిర్భయ దోషులు ఎన్ని తెలివితేటలు ప్రదర్శించిన వాళ్ళకు మరణ శిక్ష అమలు చేయడం కాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ నిందితులకు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్న కోర్ట్ పై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు సమాచారం.