మరి కొద్ది సేపటిలో నిర్భయ కేసులో తుది తీర్పు

 

సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచార కేసులో దోషులుగా గుర్తించబడిన నలుగురు వ్యక్తులు-పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ టాకూర్ మరియు ముకేష్ లకు డిల్లీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు మధ్యాహ్నం రెండున్నర గంటలకు శిక్షలు ఖరారు చేస్తూ తుది తీర్పు ప్రకటించనుంది. ఈ సందర్భంగా నగరం నలుమూలల నుండి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తుండటంతో కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. దోషులకు ఉరిశిక్ష విధించవలసిందేనంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. అయితే, దోషుల కుటుంబీకులు మాత్రం వారికి యవజీవ కారాగార శిక్ష విధించాలని లాయర్ల ద్వారా కోర్టుకి విన్నవించుకొన్నారు.

 

కోర్టు ఒకవేళ వారికి ఉరిశిక్ష విధించినప్పటికీ, వారు హైకోర్టు ఆ తరువాత సుప్రీంకోర్టులలో అప్పీలు చేసుకోవచ్చును. ఈ రెండు కోర్టులలో ఎంత లేదన్నా కనీసం మరో ఏడాది సమయం కేసు సాగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా క్రింద కోర్టు తీర్పునే ఖాయం చేసినట్లయితే ఆ నలుగురు రాష్ట్రపతి క్షమాభిక్షకి దరఖాస్తు చేసుకోవచ్చును. దేశ రాజకీయ పరిణామాలను బట్టి ఆయన ఎటువంటి నిర్ణయమయినా తీసుకొనే అవకాశం ఉంది.