నీరవ్‌ మోదీ అరెస్ట్.. త్వరలోనే భారత్ కి

 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని లండన్‌ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నారు. నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. విదేశాలకు పారిపోయిన నీరవ్‌ను భారత్‌ తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ కొద్ది నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. నీరవ్‌ మోదీ లండన్‌లోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ వజ్రాల వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించారని ఇటీవల బ్రిటన్‌ పత్రిక వెల్లడించింది. దీంతో ఆయనను భారత్ రప్పించడానికి భద్రతా ఏజెన్సీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నీరవ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకొని తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ మార్చి 9న లండన్‌లోని హోంశాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లండన్‌ కోర్టు ఆయనపై అరెస్టు వారెంటు జారీ చేసింది. దీంతో బుధవారం లండన్‌ పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. చట్టపరమైన చర్యల తర్వాత నీరవ్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది.