నిమ్స్ లో డాక్టర్ నిర్లక్ష్యం..రోగి కడుపులో కత్తెర

 

వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు..అంటే మన రోగాలను నయం చేసే వైద్యుడే మనకి దైవంతో సమానం అని అర్ధం. కానీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగాలు నయం అవ్వటం ఏమోగానీ ప్రాణాలకే ముప్పు వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఓ వైద్యుడు రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశాడు. ఓ ఆపేరేషన్ చేయించుకుంటే మరో ఆపరేషన్ ఫ్రీ అన్నట్లు ఈ వైద్యుడి నిర్వాకం. ఈ ఘనకార్యం చేసిన వైద్యుడు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో పని చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే...మహేశ్వరి (33)అనే మహిళకు మూడు నెలల క్రితం హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. శస్త్రచికిత్స సమయంలో ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెరను వైద్యులు కడుపులోనే మరిచిపోయారు.  అయితే, గత 15 రోజులుగా తరచూ కడుపునొప్పి రావడంతో రోగి మరోసారి ఆస్పత్రికి వచ్చింది. దీంతో శస్త్రచికిత్స సమయంలో ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెర కడుపులోనే ఉన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట రోగి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో కత్తెరను తొలగించేందుకు మహిళకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారు. ఇలా దేశంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.