ఉద్యోగ సంఘాలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ షాక్... ఎన్నికల విధుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్వ‌హించాల్సిందేన‌ని కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మొద‌టి విడ‌త ఎన్నిక‌ల నామినేష‌న్ల దాఖలు ప్రక్రియ మొదలైనా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మొండికేయడంతో.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో ఎన్నిక‌లు జ‌రిపేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి అయన లేఖ రాసారు. ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని అయన రాసిన లేఖలో కోరారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ.. కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణలో పాల్గొనడంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాయని నిమ్మగడ్డ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒకపక్క సీఎస్ కూడా వ్యతిరేకంగా ఉన్నారు.

 

సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించాలని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే.. అపుడు ఉద్యోగులు కూడా అదే పని చేసే అవకాశం ఉంది. మరోపక్క సీఎస్, డీజీపీ కూడా.. అదే బాట పడితే.. అపుడు ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఉద్యోగుల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు ఉద్యోగులు సహకరించకపోయినా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమైనట్లుగా ఈ లేఖ ద్వారా స్పష్టమౌతోంది.