నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కార్.. ఎవరిది పై చేయి

ఎ.పి ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఎ.పి హైకోర్టు ఈ రోజు స్పష్టం చేసింది. జగన్ సర్కార్ రమేశ్ ‌కుమార్‌‌ను తొలగిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌‌ను హైకోర్టు కొట్టేసింది. నిమ్మగడ్డ‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం కమిషనర్ కనగరాజ్ పదవి నుండి తొలగినట్టేనని న్యాయ నిపుణులు తెలియచేస్తున్నారు.

ఐతే ఈ విషయం నేపధ్యం లోకి వెళితే గత మార్చ్ నెలలో ఏపీలో స్థానిక ఎన్నికల కోలాహలంగా నడుస్తున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఐన వైసిపి అనేక నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ఏకగ్రీవ చేసుకునేందుకు అడ్డ దారుల ద్వారా ప్రయత్నించడంతో ప్రతి పక్షాలు ప్రభుత్వం పై ఎలక్షన్ కమిషనర్ కు ప్రూఫ్ ల తో సహా ఫిర్యాదు చేసాయి. దీని పై స్పందించిన రమేష్ కుమార్ విచారణ జరిపి కొన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేయాల్సిందిగా ఎపి సీఎస్ కు లేఖ రాసారు. ఐతే దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా కలకలం రేగటంతో స్థానిక సంస్థల ఎన్నికలను కమిషనర్ ఆరు వారాల పాటు వాయిదా వేశారు. దీనితో ఆగ్రహించిన సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషనర్ ది బాబుది ఒకే కులం కాబట్టి ఎన్నికలను వాయిదా వేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రజలు తనకు అధికారం అప్పచెపితే అధికారుల బదిలీ పై అయన పెత్తనం ఏంటంటూ అసలు సీఎం నేనా లేక నిమ్మగడ్డనో అర్ధం కావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీంతో రెచ్చిపోయిన విజయ్ సాయిరెడ్డి, కోడలి నాని, స్పీకర్ తమ్మినేని నిమ్మగడ్డను తీవ్ర పదజాలం తో దూషించారు. దీంతో ఎలక్షన్ కమిషనర్ కేంద్ర హోమ్ శాఖకు ఒక లేఖ రాస్తూ సాక్షాత్తు సీఎం, అధికార పార్టీ నాయకులు తన పై తీవ్ర విమర్శల చేస్తున్న నేపథ్యంలో తనకు తన కుటుంబానికి రాష్ట్రంలో రక్షణ లేదని తమ పై దాడి జరిగే అవకాశం ఉన్నందున కేంద్రమే రక్షణ కల్పించాలని అలాగే హైదరాబాద్ నుండి పని చేసే అవకాశం కల్పించాలని కోరారు. దీని పై స్పందించిన కేంద్రం ఆయనకు సీఆర్పీఎఫ్ రక్షణ కల్పిస్తూ హైద్రాబాద్ నుండి పనిచేసే వెసులుబాటు కల్పించింది. ఐతే ఈ లేఖ విషయంలో కమిషనర్ కు ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ ఐంది. అసలు ఈ లేఖ టీడీపీ ఆఫీసులో తయారైందని దాని పై ఉన్న సంతకం ఫోర్జరీదని ఎంపీ విజయ సాయి రెడ్డి సిఐడి కి కంప్లైంట్ చేయడం తో దాని పై దర్యాప్తు కూడా జరిగింది ఇది ఇలా ఉండగానే ఏప్రిల్ 10 న జగన్ ప్రభుత్వం కమిషనర్ పదవి కాలాన్ని మూడు సంవత్సరాలకు కుదిస్తూ ఆర్డినెన్సు తెచ్చి నిమ్మగడ్డ ను తొలిగించి ఆగమేఘాలపై రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను కొత్త ఎలక్షన్ కమిషనర్ గా నియమించింది. ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా రమేష్ కుమార్ ఏపి హైకోర్టును ఆశ్రయించగా దాదాపు నెల రోజుల పైగా విచారణ జరిపిన కోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎలక్షన్ కమిషనర్ గా తిరిగి బాధ్యతలు అప్పగించాలని అయన పదవి కాలాన్ని తగ్గించే అధికారం ఏపి ప్రభుత్వానికి లేదని తన తీర్పుతో స్పష్టం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ కు బాధ్యతలు అప్పగిస్తుందో లేక ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళుతుందో వేచి చూడాలి.