భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్.. నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే భంగపాటు తప్పదు

నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ తొలగింపు వ్యవహారంలో జగన్ సర్కార్ కి ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ ‌‌‌ను కొనసాగించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో నిబంధనలు మారుస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ను హైకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ స్పందించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లు నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. హైకోర్టు సూచనలతో, తాను తిరిగి చార్జ్ తీసుకున్నానని నిమ్మగడ్డ పేర్కొన్నారు. తాను గతంలో పని చేసినట్లుగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులను  నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీలతో సంప్రదించి, సాధారణ స్థితికి తిరిగి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తానని అన్నారు. వ్యవస్థలో వ్యక్తులు శాశ్వతంగా ఉండరు.. రాజ్యాంగ వ్యవస్థలే శాశ్వతం అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన వారంతా రాజ్యాంగ విలువలు, సమగ్రతను కాపాడాలని నిమ్మగడ్డ అన్నారు.

హైకోర్టు తీర్పుపై పలువురు స్పందించారు. జగన్ సర్కార్ ఇకనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయన్న విషయాన్ని వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది' అన్నారు.

"రాజ్యాంగ సంస్థల విషయంలో నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే భంగపాటు తప్పదు.ఇది మరోసారి రుజువైంది.ఎస్ఈసీగా రమేష్ కుమార్ తొలగింపు,అర్హత లేని కనగరాజ్ నియామకం రాజ్యాంగవిరుద్ధమని ఆరోజే చెప్పాను.రాష్ట్ర ప్రభుత్వమూ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైందనే విషయం గుర్తుంచుకోవాలి." అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

'భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్. న్యాయవ్యవస్థ ప్రజల్లో విశ్వాసం నింపింది. అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చింది' అని జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు.

"న్యాయం గెలిచింది చట్టం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది రాజ్యాంగం గెలిచింది న్యాయ వ్యవస్థ పై వున్న నమ్మకం నిలబడింది." అని కేశినేని నాని ట్వీట్ చేశారు.