గ‌వ‌ర్న‌ర్ తో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ కీల‌క‌ భేటీ.. ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు!

ఏపీలో స్థానిక ఎన్నికల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి మ‌ధ్య వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వగా.. ఈ నిర్ణయంపై జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఏకకాలంలో ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ కష్టమన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ను కొట్టివేసింది. ఈ నేప‌థ్యంలో ఈరోజు రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ కలిశారు. పంచాయతీ ఎన్నికలు, తాజా పరిణామాలపై చర్చించారు. ఏ ఉద్దేశ్యంతో తాను నోటిఫికేషన్ ఇచ్చాననే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు, తీర్పుపై అప్పీల్ చేసిన విషయాలపై గవర్నర్‌ కు వివరించినట్టుగా తెలుస్తోంది. ఎస్ఈసీ జేడీపై వేటు వేయడానికి గల కారణాలపై కూడా నిమ్మగడ్డ వివరణ ఇచ్చినట్టు సమాచారం. అలాగే, ఎస్‌ఈసీలోని ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆయ‌న ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఎస్ఈసీలోని ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని, ఉద్యోగులను ఎస్ఈసీకి సహకరించకుండా ప్రభుత్వం ప్రోత్సహిస్తూదంటూ పిర్యాదు చేశారని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన కామెంట్లను గవర్నర్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు స‌హ‌రించేలా ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయాల‌ని ఆయ‌న కోరిన‌ట్లు సమాచారం.