పదవీకాలం పొడిగింపు కోసం నిమ్మగడ్డ వ్యూహం?
Published on: Sat Jan 30, 2021 4:20PM
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల రచ్చ ఒకవైపు కొనసాగుతుండగానే.. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలంపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో అన్ని రకాల లోకల్ పోల్స్‌ని పూర్తి చేసే దాకా పదవిలో వుండేందుకు.. కనీసం రెండు నెలల పాటు తన పదవీ కాలాన్ని పొడిగించుకునేలా నిమ్మగడ్డ ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది మార్చితో ఎస్ఈసీగా నిమ్మగడ్డ పదవీకాలం ముగియబోతోంది. అయితే, పదవీకాలం పొడిగింపు కోసం నిమ్మగడ్డ వరుసగా ఎన్నికలు నిర్వహించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 21వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. వెంటనే 22న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి నిమ్మగడ్డ రెడీ అయినట్లు సమాచారం. అది ముగిసేలోగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక వాటి కొనసాగింపు కోసం తనకు అవకాశం ఇవ్వాలని నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది అంటున్నారు.
పదవీకాలం పొడిగింపు కోసం నిమ్మగడ్డ మరో కొత్త అంశాన్ని కూడా తెరపైకి తెస్తున్నారు అంటున్నారు. గతంలో వైసీపీ సర్కారు చర్యల కారణంగా తాను రెండు నెలల పదవీకాలం కోల్పోయానని, ఆ పదవీకాలాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ నిమ్మగడ్డ గవర్నర్ ను ఆశ్రయించే అవకాశముందని తెలుస్తోంది. 2016 ఏప్రిల్ ఒకటో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఆయన ఈ ఏడాదిమార్చి 31న రిటైర్ అవ్వాల్సి వుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోనే ఆయన్ను తొలగించి కనకరాజ్ ను ఎస్ఈసీగా నియమించింది. కనగరాజ్ రెండు నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆ తర్వాత న్యాయస్థానాల జోక్యంతో నిమ్మగడ్డ తిరిగి ఎస్ఈసీగా నియమితులయ్యారు. దీంతో తాను కోల్పోయిన ఆ రెండు నెలల పదవీకాలాన్ని తిరిగి ఇప్పించాలని నిమ్మగడ్డ కోరబోతున్నారని సమాచారం. అయితే జగన్ సర్కార్ మాత్రం మార్చి 31 తర్వాత ఒక్కరోజు కూడా నిమ్మగడ్డను పదవిలో కొనసాగకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయనుందని తెలుస్తోంది.


