ఏపీ సర్కార్ తీరు పై మళ్ళీ హైకోర్టు తలుపు తట్టిన నిమ్మగడ్డ
Published on: Wed Jun 24, 2020 4:14PM
తనను తిరిగి ఎస్ఈసీ గా నియమించాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఏపీ సర్కార్ దానిని అమలు చేయకపోవడం తో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తనకు బాధ్యతలు అప్పగించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో ఏపీ సీఎస్, పంచాయత్ రాజ్ సెక్రెటరీ, ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ నెల 13 న ఒక హోటల్ లో రమేష్ కుమార్ ఇద్దరు బీజేపీ నేతలను కలుసుకున్న వీడియోలు బయటకు వచ్చి సంచలనం రేపాయి. అయితే తాము నిమ్మగడ్డను కలవడంలో ఎలాంటి తప్పులేదని సుజనా చౌదరి, కామినేని నిన్ననే క్లారిటీ ఇచ్చారు. ఐతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నాయకులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అయన మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం తో అందరిలో ఆసక్తి నెలకొంది.


